Margadarshi : రామోజీరావు స్థాపించిన సంస్థలలో ప్రధానమైనది మార్గదర్శి. ఆ మార్గదర్శి ఏర్పాటు తర్వాతనే రామోజీరావు మరిన్ని సంస్థలను ఏర్పాటు చేశారు. ఈనాడు, రామోజీ ఫిలిం సిటీ, డాల్ఫిన్ హోటల్, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, ఈటీవీ వంటి సంస్థలను రామోజీరావు నెలకొల్పారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత సొంతం చేసుకున్నారు. మీడియా మొఘల్ గా పేరొందిన రామోజీరావు మార్గదర్శి వల్ల ఇబ్బందులు పడుతున్నారా? మార్గదర్శి కోసం ఆయన అక్రమంగా డిపాజిట్లు సేకరించారా? రశీదు పేరుతో డిపాజిటర్ల నుంచి డబ్బులు వసూలు చేశారా? తిరిగి ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం వస్తోందని “సాక్షి” చెబుతోంది. సాక్షి ఏపీ ఎడిషన్ లో సోమవారం “మార్గదర్శి షట్టర్ క్లోజ్” అనే శీర్షికతో ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది.
“మార్గదర్శిలో 16 నెలలుగా కొత్త చిట్టి గ్రూప్ లు నిలిచిపోయాయి. పాత చిట్టి లకు చెల్లింపులు లేవు. కోట్ల రూపాయల టర్న్ ఓవర్ స్తంభించిపోయింది. చిట్టీలు పాడిన వారికి సకాలంలో పాట మొత్తం చెల్లించలేక ముఖం చాటేస్తున్నారు. ఫలితంగా చందాదారులకు 4,880 కోట్లకు పైగా బకాయిలు ఇవ్వాల్సి ఉంది. షూరిటీలు ఇచ్చినప్పటికీ కొర్రీలు పెడుతున్నారు. దీంతో చందాదారులు ప్రదక్షిణలు చేస్తున్నారని” సాక్షి రాసు కొచ్చింది. వాస్తవంగా ఇది ప్రస్తుతం జరుగుతోందా? లేక ఎన్నికల సమయం కాబట్టి కావాలని రాసిందా? అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇంతటి స్థాయిలో వ్యతిరేక వార్త రాసినప్పుడు కచ్చితంగా దానికి సంబంధించిన అధికారి వివరణ ఉండాలి. పాత్రికేయ ప్రమాణాలు కూడా అవే చెబుతున్నాయి. సాక్షి “గురివింద రామోజీ – 5” అనే ఫ్లయర్ ను ఈ వార్తలో ఉపయోగించింది. అంటే గత నాలుగు రోజుల నుంచి సాక్షిలో రామోజీరావుకు సంబంధించి వ్యతిరేక వార్తలు వస్తున్నాయి అని అర్థం. స్థూలంగా ఎన్నికలు ముగిసేవరకు సాక్షి ఇలానే సిరీస్ నడిపిస్తుంది కావచ్చు.
రామోజీరావు ఆధ్వర్యంలో నడిచే ఈనాడు పత్రిక కూడా గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తోంది. ఏపీ ఎడిషన్ లో 14 పేజీలు ప్రచురిస్తున్న ఈనాడు.. వాటిల్లో ఎడిటోరియల్ పేజీ, సినిమా పేజీ మినహాయిస్తే మిగతా వాటన్నింటిలో జగన్ వ్యతిరేక కోణంలో వార్తలు ప్రచురిస్తోంది. వాస్తవానికి ఈనాడు ఒక వ్యతిరేక వార్తను ప్రచురించినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారి లేదా ఇతరుల వివరణ తీసుకుంటుంది. కానీ గత కొంతకాలంగా ఈనాడు అలాంటిదేమీ చేయడం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తోంది. ఆ మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక ఫుల్ పేజీలో జగన్మోహన్ రెడ్డికి ఆ అర్హత లేదంటూ పలు ప్రశ్నలు సంధించింది.
రామోజీరావు కు సంబంధించిన మార్గదర్శి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనిఖీలు చేయడాన్ని ఈనాడు జీర్ణించుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు తాను ఏర్పాటుచేసిన సంస్థలపై రామోజీరావు ఆధ్వర్యంలో ఈనాడు రాసిన రాతలను జగన్ ఇంకా మర్చిపోనట్టు తెలుస్తోంది. అందుకే ఒకరికి వ్యతిరేకంగా మరొకరు వార్తలు రాసుకుంటున్నారు. టీవీ లలో ప్రచారం చేసుకుంటున్నారు. రెండు బలమైన మీడియా సంస్థలు ఒకదానిపై ఒకటి బురద చిమ్ముకుంటే అంతిమంగా అది మీడియాకు నష్టం చేకూర్చుతుంది. ప్రజల్లో చులకన భావం ఏర్పడేలా చేస్తుంది. ఈ మాత్రం సోయి అటు రామోజీరావుకి, ఇటు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదనేదే ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అసలు ప్రశ్న.