Mann Ki Baat: ప్రధాని నరేంద్రమోదీ తనకు ఇష్టమైన మన్‌కీ బాత్ కార్యక్రమం ఇటీవలే వందో ఎపిసోడ్ పూర్తిచేసుకుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రంగాల్లో నిపుణులను, మరుగున పడిన వారిని మోదీ వెలుగులోకి తెస్తున్నారు. దేశానికి పరిచయం చేస్తున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్ 104వ ఎపిసోడ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మేఘాలయవాసి బ్రియాన్ డి ఖర్ర్‌పాన్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రియాన్∙తన బృందంతో కలిసి మేఘాలయాలో 1700లకు పైగా గుహలను కనుగొన్నారని చెప్పారు. బ్రియన్ చేసిన సేవలను కొనియాడారు. మేఘాలయ గుహలను సందర్శించాలని దేశ ప్రజలను కోరారు.
ఇంతకీ.. ఎవరీ బ్రియాన్ డి ఖర్ర్‌పాన్?
మన్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ బ్రియాన్ గురించి చెప్పారు. 1964లో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రియాన్ డి ఖర్ర్‌పాన్ గుహలను కనుగొనడం ప్రారంభించారు. 1990 నాటికి ఆయన తన స్నేహితులతో కలిసి ఓ సంఘాన్ని స్థాపించారు. వారందరూ కలిసి మేఘాలయాలో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో గుహలను వెలుగులోకి తీసుకువచ్చారు. ‘బ్రియాన్ డి ఖర్ర్‌పాన్ తన బృందంతో కలిసి 1700పైగా గుహలను కనిపెట్టారు. ప్రపంచ పటంలో మేఘాలయా గుహలకు స్థానం వచ్చింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అత్యంత లోతైన, పొడవైన గుహలు ఉన్నాయి’ అని ప్రధాని మోదీ చెప్పారు.
టూరిస్టులకు వినతి..
టూరిస్టులు మేఘాలయా గుహలను తమ ప్రణాళికలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. దేశంలోనే చాలా పొడవైన, లోతైన గుహలు మేఘాలయాలో ఉన్నాయని తెలిపారు. అది బ్రియాన్ చేసిన కృషి ఫలితమేనని అన్నారు. మేఘాలయ అడ్వెంచరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేసిన బ్రియాన్ డి ఖర్ర్‌పాన్ ఇప్పటివరకు రాష్ట్రంలోని 537.6 కి.మీ గుహలను చుట్టివచ్చారు.
Recommended Video: