Manmohan Singh : మన్మోహన్ సింగ్ ఉన్నత విద్యావంతుడు. ఆర్థిక రంగంలో ఆయనకు అపారమైన పట్టు ఉంది. దేశ అభ్యున్నతి కోసం ఎలాంటి విధానాలు అవలంబించాలో.. ఆయనకు ఒక అవగాహన ఉంది. అందువల్లే 1972లో ఆయన ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేయడం మొదలుపెట్టారు. 1980 -82 లో ప్రణాళిక సంఘంలో పనిచేశారు. అప్పుడు ఆయన పని చేస్తున్నప్పుడు నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఒక నిర్ణయం తీసుకున్నారు.. పట్టుబట్టి మరీ మన్మోహన్ సింగ్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అపాయింట్ చేశారు. మొదట్లో ఈ పదవిలోకి వెళ్ళడానికి మన్మోహన్ సింగ్ ఒప్పుకోలేదు. కానీ ప్రణబ్ ముఖర్జీ పట్టుబట్టి మరి ఆ స్థానంలోకి తీసుకొచ్చారు. అలా 1985 దాకా మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా కొనసాగారు. ఆ పదవి ముగిసిన తర్వాత 1985 నుంచి 87 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1987 నుంచి 1990 వరకు ఎకనామిక్ పాలసీ థింగ్ ట్యాంక్ సౌత్ కమిషన్ కు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.
అలా మారిపోయింది
1990 నవంబర్లో జెనీవా నుంచి మన్మోహన్ సింగ్ దేశానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనకు ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా మన్మోహన్ పని చేశారు. 1991లో నాటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. నాడు దేశంలో రాజకీయంగా అస్థిరత కొనసాగుతోంది. ఆ సమయంలో మైనారిటీ ప్రభుత్వానికి పీవీ నరసింహారావు నాయకత్వం వహిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడపాలని ఆయన భావించారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ అవసరమని భావించి.. రెండవ మాటకు తావు లేకుండా మన్మోహన్ సింగ్ కు ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు.. అయితే ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వారా మన్మోహన్ సింగ్ కు పీవీ నరసింహారావు తెలియజేశారు. అయితే దానిని మన్మోహన్ సింగ్ పెద్దగా పట్టించుకోలేదు.. అయితే పీవీ నేరుగా రంగంలోకి దిగి వెంటనే రాష్ట్రపతి భవన్ కు రావాలని ఆదేశాలు పంపించడంతో.. మన్మోహన్ వెళ్లిపోయారు.. అలా ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయం నాటికి మనదేశంలో ద్రవ్యలోటు విపరీతంగా ఉంది. అది ఏకంగా జిడిపిలో 8.5 శాతానికి చేరుకుంది. ఇక కరెంట్ ఖాతా లోటైతే 3.5 శాతానికి దరిదాపుల్లో ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా పడిపోయాయి. నాడు కేవలం 100 కోట్ల డాలర్లు మాత్రమే మన వద్ద ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పీవీ నరసింహారావు ప్రోత్సాహం అందించడం.. సహకారం కల్పించడం వల్ల మన్మోహన్ సింగ్ సంస్కరణలను అద్భుతంగా అమలు చేశారు. పర్మిట్ రాజ్ అనే వ్యవస్థకు చెక్ పెట్టారు. ఆర్థిక వ్యవస్థకు జీవాలు కల్పించారు. సరళీకరణ విధానాన్ని, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ను యుద్ధ ప్రాతిపదికన అమలు చేశారు. ఈ విధానాలు దేశ ఆర్థిక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించాయి. 2009లో ప్రధానిగా తొలి టర్మ్ పదవీకాలం పూర్తి చేసుకునే సమయానికి మన దేశం వద్ద విదేశీ మార్గ ద్రవ్య నిలువలు 600 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశం ఇంతటి ఘనత సాధించింది అంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.