Manda Krishna Maadiga : మంద కృష్ణ మాదిగ ప్రయాణం ఎటు? ఎమ్మార్పీఎస్ ను రాజకీయ పార్టీగా మారుస్తారా? లేకుంటే ఇప్పుడున్న పార్టీల్లో ఒక దానిలో చేరి రాజకీయ ప్రయాణం మొదలు పెడతారా? తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం ప్రారంభించింది. 1997లో ప్రకాశం జిల్లా నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఊరు మాదిగ దండోరా అంటూ ప్రచారం చేశారు. దీనికి విశేష స్పందన లభించింది. మాదిగ రిజర్వేషన్ అంశానికి మద్దతు తెలిపితే రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని చంద్రబాబు భావించారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు జై కొట్టారు. దాని ఫలితంగానే 2000లో ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. కానీ రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎస్సీ వర్గీకరణ అంశం మరుగున పడిపోయింది. దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. అప్పటినుంచి ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎమ్మార్పీఎస్ అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పోరాటానికి ఫలితం దక్కింది. మంద కృష్ణ మాదిగ అనుకున్నది సాధించగలిగారు. మాదిగల ఆశాకిరణంగా మారారు. అయితే ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రంలో అనుకూలంగా ఉన్న చంద్రబాబు, కేంద్రంలో అనుకూలంగా ఉన్న మోడీ హయాంలో.. ఈ తీర్పు రావడం విశేషం. అందుకే కృష్ణ మాదిగ సైతం ప్రధాని మోదీ తో పాటు చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీంతో త్వరలో కృష్ణ మాదిగ రాజకీయ ప్రయాణం మొదలు పెడతారు అన్న ప్రచారం జరుగుతోంది.
*:ఉద్యమ ప్రస్థానంలో ఆటుపోట్లు
మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ మాదిగ ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చాలా దెబ్బలు తిన్నారు. రాజకీయ పార్టీల నుంచి సైతం ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే సుప్రీంకోర్టు తీర్పు రాగానే భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలకు ఈ విజయాన్ని అంకితం చేశారు. ఇన్నాళ్ళు ఎస్సీ వర్గీకరణ కోసం రాజీలేని పోరాటాలు చేసిన మందకృష్ణ పొలిటికల్ పార్టీ ద్వారా సామాజిక వర్గం అభ్యున్నతికి పాటుపడతారని తెలుస్తోంది.
*:బిజెపిలో చేరతారని ప్రచారం
ఇప్పుడున్న పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని ప్రధాని మోడీ పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే ప్రకటించారు. దీంతో మాదిగలంతా బిజెపిని బలపరచాలని మందకృష్ణ పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం కావడంతో ఆయన బిజెపితో కలిసి సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎక్కువ. అందుకే మంద కృష్ణ మాదిగను చేర్చుకుంటే బలపడతామని బిజెపి భావిస్తోంది.
* ఏపీలో చంద్రబాబు పక్షమే
ఏపీలో మాత్రం చంద్రబాబు వైపు మాదిగలు ఉండేలా ఇప్పటికే మందకృష్ణ చాలా సందర్భాల్లో పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు అధ్యుడు చంద్రబాబు అని.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే మందకృష్ణ మాదిగ ప్రకటించారు. టిడిపి తో పాటు చంద్రబాబు పై ఉన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో మాత్రం మాదిగలు ఎప్పుడు టిడిపి పక్షమేనని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో మాత్రం ఆయన బిజెపిలో చేరతారనేకంటే.. బిజెపి ఆయన కోసం తప్పకుండా ప్రయత్నిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Manda krishna madiga is likely to join the bjp as the way for sc classification is paved
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com