Manchu Manoj- Chandrababu: తెలుగు సినీ రంగంలో మంచు మోహన్ బాబు కుటుంబానిది ప్రత్యేక స్థానం. అయితే మోహన్ బాబులా ఆయన కుమారులు సినీ రంగంలో అంతగా రాణించలేకపోయారు.కానీ తరచూ వార్తల్లో నిలవడంలో మాత్రం ముందుంటారు. తాజాగా మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ కుమార్,మౌనికా రెడ్డి దంపతులు చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో మనోజ్ పొలిటికల్ ఎంట్రీ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. కానీ అంతగా యాక్టివ్ గా లేరు. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆయన పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకు ప్రాధాన్యత లేకుండా పోయింది. పృధ్విరాజ్,ఆలీ, పోసాని కృష్ణ మురళి వంటి వారికి పదవులు దక్కినా.. జగన్ మోహన్ బాబుని మాత్రం పక్కన పడేశారు. దీంతో మోహన్ బాబు కూడా పార్టీకి అంటీ ముట్టునట్టుగా ఉన్నారు. ఈ తరుణంలో ఇటీవల చంద్రబాబును కలిసిన సందర్భాలు ఉన్నాయి. మోహన్ బాబు సైతం టిడిపి వైపు వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మంచు మనోజ్ కుమార్ దంపతులు చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భూమా కుటుంబం ప్రస్తుతం టిడిపిలో ఉంది. భూమా అఖిలప్రియ టిడిపి సర్కార్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో మౌనిక రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. సోదరుడు బ్రహ్మానంద రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. తరువాత రాజకీయాలపై అంతగా దృష్టి పెట్టలేదు. సోదరీ,సోదరుడు టిడిపిలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మౌనిక రెడ్డి అనూహ్యంగా
మంచు మనోజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి దంపతులు టిడిపి అధినేత చంద్రబాబును కలిశారు.. మౌనిక రెడ్డి కుమారుడిని.. పెళ్లి తర్వాత తన కుమారుడిగా స్వీకరించానని మంచు మనోజ్ ప్రకటించారు. మంగళవారం బాబు పుట్టినరోజు కావడంతో ఆ దంపతులుచంద్రబాబు ఆశీస్సులు కోసం కలిసినట్లు చెప్పుకొస్తున్నారు. దీంతో మనోజ్ టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం ఊపందుకుంది. మంచు మనోజ్ ఏ పార్టీలోనూ లేరు. వైసీపీలో చేరతారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు చంద్రబాబును కలవడంతో మనసు మార్చుకున్నట్లుంది.