Producer Shobu Yarlagadda- Vishwak Sen: బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కొత్త వివాదానికి తెరలేపారు. ఆయన వేసిన ఒక ట్వీట్ హీరో విశ్వక్ సేన్ ని ఉద్దేశించే అనే చర్చ నడుస్తుంది. ఇటీవల బేబీ చిత్ర డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వక్ సేన్ మధ్య సోషల్ మీడియా వార్ నడిచింది. బేబీ చిత్ర కథను వినడానికి కూడా ఒక హీరో ఇష్టపడలేదు. ఆ డైరెక్టర్ అయితే స్క్రిప్ట్ వినడం కూడా వేస్ట్ అని నన్ను కలవలేదని సాయి రాజేష్ ఆరోపణ చెప్పాడు. ఆ హీరో ఎవరనేది సాయి రాజేష్ చెప్పలేదు. సాయి రాజేష్ ఈ కామెంట్స్ చేశాక విశ్వక్ సేన్ ఒక అనుమాస్పద ట్వీట్ చేశాడు.
నో మీన్స్ నో… ఇది మగవాళ్లకు కూడా వర్తిస్తుంది. మనం ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నాము. గొడవ చేయకుండా గమ్మున ఉండండి, అని ట్వీట్ చేశాడు. ఇది సాయి రాజేష్ మాటలకు విశ్వక్ సేన్ కౌంటర్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సాయి రాజేష్ చెప్పిన హీరో విశ్వక్ సేనే అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. విశ్వక్ ట్వీట్స్ కి సాయి రాజేష్ కూడా కౌంటర్ ట్వీట్స్ వేశాడు.
సడన్ గా సీన్లోకి శోభు యార్లగడ్డ వచ్చాడు. నిన్న ఆయన ‘ఇప్పుడే ఎదుగుతున్న హీరో తన యాటిట్యూడ్ తో ఒక హిట్ కొట్టాడు. సక్సెస్ తలపొగరు తెస్తుంది. కానీ దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఒక దర్శకుడు స్క్రిప్ట్ చెబుతానంటే కనీసం వినకుండా అవమానించడం ఎంత వరకు కరెక్ట్. కెరీర్లో ఎదగాలంటే ఇలాంటి యాటిట్యూడ్ వదులుకోవాలి. అది ఎప్పుడు తెలుసుకుంటాడో’ అని ట్వీట్ చేశాడు.
ఇక శోభు యార్లగడ్డ ప్రస్తావించిన హీరో విశ్వక్ సేన్ అని నెటిజెన్స్ నిర్దారించారు. అనూహ్యంగా సదరు ట్వీట్ ని శోభు యార్లగడ్డ డిలీట్ చేశాడు. అలాగే విశ్వక్ సేన్ కాదంటూ కామెంట్ చేశాడు. ఆయన ఎన్ని చెప్పినా… జనాలు నమ్మడం లేదు. విశ్వక్ సేన్ నే శోభు యార్లగడ్డ టార్గెట్ చేశాడనే చర్చ మొదలైంది. వివాదాలకు దూరంగా ఉండే శోభు యార్లగడ్డ ఒక చిన్న హీరో, డైరెక్టర్ వివాదంలో ఎందుకు తలదూర్చాడో అర్థం కావడం లేదు.
సాయి రాజేష్-విశ్వక్ సేన్ వివాదం సద్దుమణిగింది. అనవసరంగా ఇప్పుడు శోభు యార్లగడ్డ గెలికాడు. కాగా విశ్వక్ పలుమార్లు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. ఫలక్ నుమా దాస్ మూవీ విడుదలకు ముందు నానా రచ్చ చేశాడు. తన మూవీ పోస్టర్స్ చించేశారని దాని వెనుక హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడని ఆరోపించాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్స్ కో పబ్లిక్ లో న్యూసెన్స్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తాజాగా బేబీ చిత్ర వివాదం ఆయన్ని చుట్టుముట్టింది.