వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన సందీప్ (Sandeep) మృతికి కారణమైన యువతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మంద స్రవంతి, సందీప్ అక్క ఐదో తరగతి వరకు పాలకుర్తిలోని ఓ పాఠశాలలో చదివారు. దీంతో సందీప్ కు స్రవంతితో పరిచయం ఏర్పడింది. సందీప్ ఆమెను అక్క అని పిలిచేవాడు. ఈక్రమంలో ఏడు నెలల క్రితం సందీప్ ఆమెకు ఫోన్ చేయగా గొంతు మార్చి మరో అమ్మాయిగా మాట్లాడింది.
అతడిని ఆట పట్టించేందుకు ఆమె పేరు కావ్యగా పరిచయం చేసింది. దీంతో ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీనికి ఆమెకు వివాహమైంది మరచిపో అని చెప్పింది. ఈ నేపథ్యంలో సందీప్ మరో అమ్మాయిని ప్రేమించాడు. కానీ కొన్ని రోజులకు కావ్య భర్తకు విడాకులిచ్చింది నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని పేర్కొంది. కొద్ది రోజులకు కావ్య ఆత్మహత్య చేసుకుందని కావాలంటే ఆమె సోదరితో మాట్లాడు అని మరో అమ్మాయితో మాట్లాడించింది.
ఆమె మృతికి నీవే కారణమని వారి బంధువులు మీ ఇంటికి వస్తున్నారని బెదిరించింది. ఆందోళన చెందిన సందీప్ ఈనెల 13న స్వగ్రామంలో విషం తాగి 18న మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు స్రవంతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రాయపర్తి ఎస్సై బండారి రాజు, పీఎస్సై వడ్డే సందీప్ తెలిపారు.