Man Dies: మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. సాటి మనిషి అన్న జాలి కూడా లేకుండా కర్కశంగా వ్యవహరించి ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. అతడు చేసిన నేరమేమీ లేకున్నా తన ప్రతాపం చూపించి ఒంటరి వాడిని చేసి కాళ్లకు తాళ్లు కట్టి వాహనానికి కట్టి జంతువులా ఈడ్చుకెళ్లి అతడి ప్రాణాలు తీశారు. ఇంత జరుగుతున్నా ఎవరు స్పందించలేదు. నాగరికత ప్రపంచంలో ఇలాంటి అనాగరిక చర్యలు చోటుచేసుకోవడం బాధాకరమే. చేయని నేరానికి బాధ్యుడిని చేసి చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసిన వారిపై ఏమేర కు చర్యలు ఉంటాయో వేచి చూడాల్సిందే.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ర్టంలోని నీమచ్ జిల్లాలోని సింగోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ గ్రామానికి చెందిన కన్హయలాల్ భీల్(40) సింగోలీ-నీమచ్ ప్రధాన రోడ్డుపై గత గురువారం నిలబడి ఉన్నాడు. ఛితర్ నూల్ గుర్జార్ అనే పాల వ్యాపారి తన ద్విచక్ర వాహనంపై వచ్చి భీల్ ను ఢీకొట్టి కిందపడిపోయాడు. పాలు మొత్తం నేలపాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తుడైన పాల వ్యాపారి తన స్నేహితులను పిలిపించి భీల్ పై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి ట్రక్కు వెనకాల కట్టేసి కొంత దూరం ఈడ్చుకెళ్లారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ (Viral Video) అవుతోంది. స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారకులైన వారు అక్కడి నుంచి పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సూరజ్ కుమార్ వర్మ తెలిపారు. ఇప్పటివరకు ఒకరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మిగతా వారు పరారీలో ఉన్నారని వివరించారు.
చేయని తప్పుకు బాధ్యుడిని చేసి ప్రాణాలు తీయడంపై విమర్శలు వస్తున్నాయి. అతడే వచ్చి వాహనంతో ఢీకొట్టి కావాలనే ఏపాపం ఎరుగని వాడిపై పాశవికంగా దాడి చేయడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అమానవీయ సంఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు విదించాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.