Gandhi Jayanti 2021: మహాత్ముడు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి. దేశాన్నంతటిని ఒకే వేదికపైకి తెచ్చిన మూర్తి. ఆయన సంకల్పం, మనోబలం అనితర సాధ్యం. ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడమంటే మాటలు కాదు. దానికి ఎంతో ఓర్పు కావాలి. అది ఉన్నందు వల్లే ఆయన దేశప్రజలందరి చేత మహాత్ముడు అని పిలిపించుకున్నారు. మహాత్మాగాంధీ బ్రిటిష్ వారిని తమ దేశానికి పంపించడంలో ఆయన కృషి, పట్టుదల అనితర సాధ్యం. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మానవతా మూర్తి. ఆదర్శానికే స్ఫూర్తి.

సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ముచ్చెమటలు పట్టించారు. అహింస, సత్యం అనే ఆయుధాలే లక్ష్యంగా ముందుకు కదిలారు. సమాజ హితమే తన అభిమతంగా అందరిలో స్వాతంత్ర్య దీక్ష రగిలించారు. అందరిని ఏకం చేసి ఆంగ్లేయులపై పోరాడారు. జైలుకెళ్లినా దేశం కోసమే ఆలోచనలు చేశారు. తన ఆత్మకథ పుస్తకంలో పలు విషయాలు వ్యక్తీకరించారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అమ్ముడైన పుస్తకాలలో అది ఒకటి కావడం విశేషం.
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించినా మగ్గం చేతబట్టి నూలు నేసినా, చీపురు పట్టి మురికి వాడలు శుభ్రం చేసినా ఆయనలో చేసే పనిలో శ్రద్ధ, పట్టుదల, దీక్ష కనిపించడం మామూలే. నిస్వార్థంగా దేశం కోసం సర్వస్వం అర్పించిన మానవతా మూర్తి. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా తన ఆశయాలను పాటించే వారున్నారంటే అతిశయోక్తి కాదు.
మహాత్మగాంధీ అక్టోబర్ 2,1869లో గుజరాత్ రాష్ర్టంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్తీబాయి దంపతులకు జన్మించారు. తండ్రి పోరుబంరద్ లో ఒక సంస్థానంలో దివాన్ గా పనిచేసేవారు. తల్లి గృహిణి. గాంధీజీ చిన్నతనంలో చురుకైన విద్యార్థిగా ఉండేవాడు కాదు. వెనుకబెంచీలో కూర్చుని ఉండేవాడు. ప్రాథమిక విద్య రాజ్ కోట్ లో, ఉన్నత విద్య కథియవాడ్ లో పూర్తి చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడే తెల్లవారిపై తిరుగుబాటు చేశారు.
ఇరవయ్యో శతాబ్దంలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో గాంధీజీ ముందుంటారనడంలో సందేహం లేదు. 250 ఏళ్లకు పైగా బ్రిటిష్ వారు మనదేశాన్ని పీడిస్తున్న క్రమంలో వారిని సరిహద్దులు దాటించిన శక్తిగా గాంధీజీ సేవలు అమోఘం. గోపాలకృష్ణ గోఖలే పిలుపుతో గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగి వచ్చారు. బ్రిటిష్ వారిని వెళ్లగొట్టే వరకు అలుపెరగని పోరాటం చేశారు.
స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో గాంధీజీ ఎంతో శ్రమించారు. ఎన్నో వ్యవయప్రయాసలకోర్చారు. జైలుకెళ్లారు. కానీ తన పుట్టిన రోజును మాత్రం జరుపుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఆయన జీవితంలో ఒకే సారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం గమనార్హం. అది కూడా ఓ సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకున్నారు. 1944 ఫిబ్రవరిలో మరణించిన గాంధీజీ భార్య కస్తూర్బా సంస్మరణార్థం ఏర్పాటు చేసిన ట్రస్టుకు నిధుల సేకరణకు సభ్యులంతా బతిమాలితే ఒప్పుకున్నారు.
1948 జనవరి 30న సాయంత్రం ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. ప్రపంచాన్నే నడిపించిన వ్యక్తిగా గాంధీజీ హేరామ్ అంటూ తన ప్రాణాలు విడిచారు. మహాత్మగాంధీ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను పరిశీలిస్తే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆయన వ్యవహార శైలి భిన్నంగా ఉండేది. దినచర్యతో పాటు ఆయన చర్యలు కూడా అందరిని ప్రభావితం చేశాయి.