Huzurabad Bypoll: హుజురాబాద్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. పార్టీల్లో ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, టీఆర్ఎస్ ఓట్ల కోసం పాట్లు పడుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు అభ్యర్థినే ప్రకటించలేదు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు పోటీలో ఉంటారా? లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఈ విషయంలో నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంత పెద్ద పార్టీలో కనీసం అభ్యర్థి కూడా కరువేనా అనే సంశయాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థి ప్రకటన కాంగ్రెస్ కు ఓ సవాలుగానే నిలిచింది.

అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే ఇంతవరకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన చేయకపోవడంతో పార్టీ పలు ప్రశ్నలు ఎదుర్కొంటోంది. ఒక జాతీయ పార్టీ, వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీకి అభ్యర్థి ఇంకా తారసపడకపోవడం విడ్డూరమే అని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే వరంగల్ మహిళా నేత కొండా సురేఖ పేరు వినిపించినా ఎందుకో తెరపైకి రావడం లేదు. దీంతో కార్యకర్తల్లో కూడా నైరాశ్యం పట్టుకుంది. పార్టీ విధానాల్లో ఇంకా స్పష్టత లేకపోవడం గమనార్హం.
టీఆర్ఎస్ అధిష్టానం హుజురాబాద్ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికకే 20 మంది నేతలతో స్టార్ క్యాంపెయినర్స్ ను ప్రకటించింది. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, సతీష్ కుమార్, గువ్వల బాలరాజు, అరూరి రమేశ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, కాసుమల్ల విజయ పేర్లను ఎన్నికల సంఘానికి పంపింది.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో నియోజకవర్గం చుట్టి వచ్చారు. కేసీఆర్ ధనదాహానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోటీ అని పేర్కొంటున్నారు. ఇక గులాబీ పార్టీ దళితబంధు పథకంతో ఓట్లు కొల్లగొట్టాలని పథకాలు రచిస్తోంది. దీంతో టీఆర్ఎస్ పాచిక ఏ మేరకు పారనుందో వేచి చూడాల్సిందే. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు పార్టీల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందోననే ఉత్కంఠ రాష్ర్టవ్యాప్తంగా నెలకొంది.