Mahasena Rajesh: మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం

గత ఎన్నికల్లో మహాసేన రాజేష్ వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజేష్ ను దూరం పెట్టింది. క్రమేపి ఆయన జనసేనకు దగ్గరయ్యారు.

Written By: Dharma, Updated On : March 3, 2024 10:42 am
Follow us on

Mahasena Rajesh: తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాలో అనూహ్య పేర్లు తెరపైకి వచ్చాయి. అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేష్ లాంటి నేతలకు టిడిపి టికెట్లు ఇచ్చింది. ఇందులో కొలికపూడి వరకు పరవాలేకున్నా.. మహాసేన రాజేష్ విషయానికి వచ్చేసరికి ఎన్నో రకాల వివాదాలు తెరపైకి వచ్చాయి. టిడిపి, జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వివాదాలు జరిగాయి. ఈ పరిణామ క్రమంలో మహాసేన రాజేష్ కీలక ప్రకటన చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.

గత ఎన్నికల్లో మహాసేన రాజేష్ వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజేష్ ను దూరం పెట్టింది. క్రమేపి ఆయన జనసేనకు దగ్గరయ్యారు. యూట్యూబ్ ఛానల్ తో ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో మహాసేన రాజేష్ జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పని చేస్తూ వస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో సైతం సేవలందించారు. ఈ తరుణంలో ఆయనను పీ.గన్నవరం నియోజకవర్గానికి అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. అప్పటినుంచి వివాదాలు చుట్టుముట్టాయి. మహాసేన రాజేష్ వైసీపీలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి పై సోషల్ మీడియాలో ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పి.గన్నవరం నియోజకవర్గంలో టిడిపి, జనసేన ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సమన్వయ సమావేశం సైతం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా పోస్టులు పెడుతూ ట్రోల్ చేస్తోంది.

తన అభ్యర్థిత్వ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూసి మహాసేన రాజేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి తన గురించి అధికార వైసిపి విపరీతమైన దుష్ప్రచారం చేస్తోందని.. ఏవేవో వీడియోలు పెట్టి తన ఇమేజ్ను దెబ్బతీస్తోందని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు.తనకు టిక్కెట్ ఇవ్వడం పై జరిగిన గొడవల వెనుక వైసిపి ఉందని ఆయన ఆరోపించారు. వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి.. ఆ హత్య వెనుక ఉన్న జగన్.. దళితుడైన తన డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంత బాబు లాంటి వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తారని.. కానీ దళితుడైన తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని.. ఈ విషయాలు తాను గుర్తుపెట్టుకుంటానని రాజేష్ అన్నాడు. తన నుంచి తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాకూడదని.. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటించడం సంచలనంగా మారింది.