Mahasena Rajesh: జనసేనలోకి చేరికలు షురూ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో చేరికలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో తటస్థులు, మేధావివర్గాల వారు, వివిధ రంగాల ప్రముఖులు ఆ పార్టీలో చేరేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. ప్రధానంగా మహాసేన రాజేష్ త్వరలో జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది. మహాసేన రాజేష్ రాష్ట్రంలో విస్తృత నెట్ వర్క్ ఉన్న వ్యక్తి. అటు యూట్యూబ్ చానల్ లో ప్రభుత్వ వైఫల్యాలను గత కొంతకాలంగా ఎండగడుతూ వస్తున్నారు. దీంతో ఆయనపై ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు దిగింది. ఎక్కడికక్కడే వైసీపీ నేతలు ఆయనపై తప్పుడు ఫిర్యాదులు చేశారు. అయితే కొన్ని కేసులకు సంబంధించి ఆయన కోర్టులో సవాల్ చేస్తూ న్యాయం పొందగలిగారు.

మహాసేన రాజేష్ జనసేనలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. గత కొంతకాలంగా పవన్, జనసేలపై సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పవన్ చర్యలను,రాజకీయ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. దీంతో ఆయనపై అధికార పక్షం కక్ష పెంచుకుంది. ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా రాజేష్ వెనక్కి తగ్గలేదు. పవన్ పై తనకున్న అభిమానాన్ని తగ్గించుకోలేదు. అందుకే నేరుగా జనసేనలో అడుగుపెట్టి సేవలందించాలని నిర్ణయించుకున్నారు. జనసేన వాయిస్ ను పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజేష్ చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అయితే రాజేష్ చేరికపై జనసేన నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు తటస్థులు, ప్రముఖులు జనసేనలతో చేరనున్నట్టు తెలుస్తోంది. వారితో పాటే రాజేష్ చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ నియోజకవర్గాల రివ్యూలో బిజీగా ఉన్నారు. అటు బస్సు యాత్రను కూడా వాయిదా వేసుకున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న బస్సు యాత్రలో నేతలను చేర్చుకుంటే పార్టీకి ఊపు వస్తుందని జనసేనవర్గాలు భావిస్తున్నాయి. ఈ చేరికలపై ఒకటి రెండు రోజుల్లో జనసేన అధిష్టానం క్లారిటీ ఇచ్చే అవకాశముంది.