BJP vs BJP: ఇప్పటిదాకా నరేంద్ర మోడీని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని దూషించిన ముఖ్యమంత్రులను చూశాం. మోదీని పడగొడతామని సవాల్ చేసిన మమతా బెనర్జీలను, చంద్రశేఖర రావు లాంటివాళ్ళను చూసాం. కానీ బిజెపి ముఖ్యమంత్రి, మరో బిజెపి ఉపముఖ్యమంత్రి పై విమర్శలు చేసుకోవడం ఎప్పుడైనా చూశామా? కానీ ఇటువంటి విచిత్ర పరిస్థితి ఇప్పుడు ఆ పార్టీ కి ఎదురవుతోంది.. ఇందుకు కారణం సరిహద్దు గ్రామాల వివాదం. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ, మరాఠీ మాట్లాడే గ్రామాలు తమకే చెందుతాయంటూ ఇరు ప్రాంతాల నేతలు ప్రకటనలు చేయడం, కోర్టు కేసు పై దృష్టి సారించడం తాజా వివాదానికి తెరలేపింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్న విస్ వ్యాఖ్యలను తీవ్రంగా పేర్కొన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై … రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. ఇద్దరు కీలక నేతలు పార్టీని పక్కనపెట్టి స్థానిక మనోభావాలే ప్రాధాన్యంగా భావిస్తూ మాటలు యుద్ధానికి దిగడం దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

అప్పట్లో జరిగింది ఇదీ..
మహారాష్ట్ర లోని సాంగ్లీ జిల్లాలో జాట్ తహసిల్దార్ పరిధిలోకి చెందిన గ్రామాలు కర్ణాటకలో విలీనం అయ్యేందుకు తీర్మానం చేశాయంటూ ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ పేర్కొన్నారు. అయితే ఇది మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతని కోసం ఎదురుచూస్తున్న విపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని మరాఠా విపక్ష నేత అజిత్ పవార్ డిమాండ్ చేశారు.. దీనిపై దేవేంద్ర స్పందిస్తూ.. జాట్ తీర్మానం 2012లో జరిగింది.. అది పాత ప్రతిపాదన. వారసులో ఏ గ్రామం కూడా కర్ణాటకలో విలీనం కావాలి అనుకోవడం లేదు.. సరిహద్దులోని ఏ ప్రాంతం కూడా ఎక్కడికి పోయే ప్రశ్న లేదు అని ఆయన స్పష్టం చేశారు.. ఇక బెల్గాం, కార్వార్, నిపాని వంటి మరాఠీ మాట్లాడే ప్రాంతాలపై మరోసారి చెప్పిన దేవేంద్ర.. వాటిని మహారాష్ట్రలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తీవ్రంగా పోరాడుతామని ఆయన కుండ బద్దలు కొట్టారు.
దేవేంద్ర కలలు ఎప్పటికీ నెరవేరవు
కాగా దేవేంద్ర వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తమ ప్రాంతాలను రక్షించుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సరిహద్దు గ్రామాలను ఎప్పటికీ కూడా వదులుకునే ప్రసక్తి లేదన్నారు. మహారాష్ట్ర లో కన్నడ మాట్లాడే షోలాపూర్, అక్కల్ కోట్ ప్రాంతాలను కర్ణాటకలో కలపాలి అని డిమాండ్ చేశారు. ఇక సరిహద్దు ప్రాంతాన్ని మహారాష్ట్ర లోని అన్ని ప్రాంతాలు రాజకీయంగా వాడుకుంటూనే ఉన్నాయి. మహా ప్రభుత్వం 2004 నుంచి సుప్రీం కోర్టులో పోరాడుతూనే ఉంది..ఇప్పటి వరకూ విజయం సాధించలేదు. గతంలో లాతూర్ లో నీటి సంక్షోభం తలెత్తినప్పుడు కొన్ని గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని తీర్మానం చేశారు. అప్పట్లో విలీన డిమాండ్ ను కర్ణాటక సమ్మతించింది.

ఐదు దశాబ్దాల వివాదం
మహా, కర్ణాటక మధ్య సరిహద్దు గ్రామాల వివాదం గత ఐదు దశాబ్దాల నుంచి సాగుతోంది. 1956 లో ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో మహా సరిహద్దులో ఉన్న కన్నడ మాట్లాడే గ్రామాలు తమవని కర్ణాటక అంటున్నది. అప్పట్లో దీనిపై కేంద్రం ఏర్పాటు చేసిన మహాజన్ కమిషన్ కమిటీ 1960లో ఒక నివేదిక అందించింది. కానీ దీనిని మహా సర్కారు తోసిపుచ్చింది.ఇలా ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా అది అలాగే ఆగిపోయింది. చివరకు మహా ప్రభుత్వం 2004 లో సుప్రీం ను ఆశ్రయించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా అది అలాగే పెండింగ్ లో ఉంది. ఇక మహా సీఎం ఏక్ నాథ్ షిండే బెల్గాం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని మహా రాష్ట్ర లో కలపాలి అని బాలా సాహెబ్ థాక్రే మద్దతు ఇచ్చేవారని పేర్కొన్నారు. కాగా సరిహద్దు గ్రామాల పై న్యాయ పరంగా పోరాడేందుకు గానూ మహా ప్రభుత్వం ఇద్దరు మంత్రులతో ఒక కమిటీని నియమించింది. అటు కర్ణాటక కూడా కసరత్తు చేస్తోంది. మరో ఏడాది లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ వివాదం చెలరేగడంతో బసవరాజ్ దూకుడు గా వ్యవహరిస్తున్నారు. కన్నడ ప్రయోజనాలే తనకు ముఖ్యమనేలా ఆయన వ్యవహరిస్తున్నారు. కాగా స్వపక్షానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి, మరో ఉప ముఖ్యమంత్రి ఇలా వ్యవహరిస్తున్న తీరు దేశ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.. దీనిపై బిజెపి పెద్దలు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం