https://oktelugu.com/

Maharashtra Crisis: చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ రాజీనామా.. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?

Maharashtra Crisis: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పొత్తు పెట్టుకున్నది ఒకరితో.. సీఎం కుర్చీ కోసం మోసం చేసి వెళ్లింది మరొకరితో.. శివసేన రాజకీయ తప్పటడుగులకు ముగింపు పడింది. తమకు అలివికానీ పార్టీలతో పొత్తు పెట్టుకొని గద్దెనెక్కిన శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే అవమానకర రీతిలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. గత మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ+శివసేన కలిసి పొత్తు పెట్టుకొని మహారాష్ట్రలో పోటీచేశాయి. ఇక కాంగ్రెస్, ఎన్సీపీలు పొత్తు పెట్టుకొని ప్రత్యర్థులుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 29, 2022 10:07 pm
    Follow us on

    Maharashtra Crisis: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పొత్తు పెట్టుకున్నది ఒకరితో.. సీఎం కుర్చీ కోసం మోసం చేసి వెళ్లింది మరొకరితో.. శివసేన రాజకీయ తప్పటడుగులకు ముగింపు పడింది. తమకు అలివికానీ పార్టీలతో పొత్తు పెట్టుకొని గద్దెనెక్కిన శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే అవమానకర రీతిలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది.

    గత మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ+శివసేన కలిసి పొత్తు పెట్టుకొని మహారాష్ట్రలో పోటీచేశాయి. ఇక కాంగ్రెస్, ఎన్సీపీలు పొత్తు పెట్టుకొని ప్రత్యర్థులుగా నిలిచాయి. ఈ సమయంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. శివసేన, బీజేపీ కూటమికే మెజార్టీ సీట్లు వచ్చాయి. కానీ సీఎం సీటు తనకు ఇవ్వాలని పేచీ పెట్టిన శివసేన అధిపతి ఉద్దవ్ ఠాక్రే ప్లేటు ఫిరాయించి బీజేపీని మోసం చేసి తనకు బద్ద శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి గద్దెనెక్కారు. సీఎం కుర్చీ కోసం తన హిందుత్వ ఎజెండాను కూడా పక్కనపెట్టి.. శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే నియమాలు కూడా గంగలో కలిపిన చరిత్ర ఉద్దవ్ ది. బాల్ థాకరే తనకు మెజార్టీ సీట్లు వచ్చినా కూడా పదవులు ఎక్కనని త్యాగం చేసిన మహా మనిషి. గతంలో బీజేపీకి సపోర్ట్ చేశారు.హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లారు.

    కానీ ఆయన కుమారుడు ఉద్దవ్ మాత్రం హిందుత్వ ఎజెండాను పక్కనపెట్టి సీఎం కుర్చీ కోసం సెక్యులర్ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిశారు. శివసైనికులకే షాక్ ఇచ్చారు. అయితే అనైతికంగా కలిసిన ఈ పొత్తు పొడవలేదు. శివసేన ప్రభుత్వంలో ఉద్దవ్ కంటే ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే కింగ్ మేకర్ అయ్యి మంత్రులను డమ్మీగా చేసి అన్నింట్లో వేలు పెట్టడంతో కడుపు మండిన మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి అసమ్మతి రాజేశారు. అస్సాంకు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లి క్యాంపు ఏర్పాటు చేశారు.

    శివసేనకు ఉన్న 60 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది షిండే పక్కన చేరడంతో శివసేన ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. షిండేతో చేసిన రాయబారాలు పనిచేయలేదు. ఉద్దవ్ , ఆదిత్య పోకడలు.. పాలన ఆధిపత్యాలు, హిందుత్వ వ్యతిరేక విధానాలతో విసిగి వేసారిన హిండే, శివసేన ఎమ్మెల్యేలు ఉద్దవ్ ను ఎదురించారు. గవర్నర్ రేపు బలపరీక్ష పెట్టి మైనార్టీలో పడిపోయిన శివసేన ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని ఆదేశించాడు.

    ఇక చేసేదేం లేక చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టుకు ఎక్కిన సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అక్కడా చుక్కెదురైంది. బలపరీక్షకు నిలిచి బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు సూచించడంతో ఇక తనకు బలం లేదని తెలిసి.. అనవసరంగా అసెంబ్లీలో పరువు పోగొట్టుకునే బదులు ముందే రాజీనామా చేయాలని తలంచారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే భారమైన హృదయంతో ఫేస్ బుక్ లైవ్ లో ప్రజలతో మాట్లాడి సీఎం కుర్చీ దిగిపోయారు. చైనా ఓ వైపు సరిహద్దుల్లో మన భూమిని ఆక్రమిస్తుంటే కేంద్రంలోని బీజేపీ మాత్రం మహారాష్ట్రపై దృష్టి సారించిందని.. ఇక్కడ శివసేన ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బిజీగా ఉందని ఉద్దవ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. కుట్ర పన్ని శివసేన ఎమ్మెల్యేలను లాగి కూల్చివేశారని ఆరోపించారు.

    అంతకుముందు చివరి సారి కేబినెట్ మీటింగ్ కు వచ్చిన ఉద్దవ్ ఠాక్రే ముభావంగా కనిపించారు. మొములో నెత్తురు చుక్కలేదు. మంత్రులు, అధికారులకు చివరి సారి వీడ్కోలు పలికి రాజీనామా సమర్పించారు. అసెంబ్లీలో బలపరీక్షకు ముందే ఔట్ అయిపోయారు.

    నాడు బీజేపీని ఇలానే మోసం చేసి గద్దెనెక్కిన ఉద్దవ్ కు ఇప్పుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు అదే పనిచేస్తే ఆవేదన తన్నుకొచ్చింది. కానీ చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవ అంటే ఇదే. అందుకే ఉద్దవ్ ను చూసి ఇప్పుడు ఎవ్వరూ పాపం అనని పరిస్థితి నెలకొంది.