
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కరోనా ఉధృతి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విధంగా కరోనా ఉధృతి కొనసాగితే లాక్ డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
Also Read: కంగారు పెడుతున్న కరోనా
రాష్ట్రంలో కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. రాష్ట్రంలో త్వరలో మరిన్ని కఠిన ఆంక్షలను అమలు చేస్తామని.. కరోనా గొలుసును చేధించడానికి పరిష్కారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఉద్ధవ్ అన్నారు. కొంతమంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మాస్క్ ధరంచకపోవడంతో వైరస్ బారిన పడుతున్నారని సీఎం పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో రోజుకు రెండున్నర లక్షల కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. వైరస్ తీవ్రతను బట్టి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. గత మూడు రోజులుగా మహారాష్ట్రలో 40,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు ముంబై నగరంలోనే నమోదవుతున్నాయని సీఎం వెల్లడించడం గమనార్హం.
Also Read: వామ్మో.. కరోనా సోకితే కంటిచూపు పోతుందా?
అయితే లాక్ డౌన్ గురించి సీఎం ప్రకటన చేసినా అమలు చేయడం మాత్రం అంత తేలిక కాదని ఒకవేళ లాక్ డౌన్ ను అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక స్థితిపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.