బీజేపీలో చౌహన్ – సింధియా కుమ్ములాట

భారత దేశంలో మంత్రివర్గం అంటూ లేకుండా ఒక్కడిగానే ప్రభుత్వం సుదీర్ఘకాలం నడిపి రికార్డు సృష్టించిన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చివరకు నాలుగోసారి పదవి చేపట్టిన 29 రోజులకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. లాక్ డౌన్ కు రెండు రోజుల ముందే సీఎం పదవి చేపట్టిన ఆయన కీలకమైన ఇటువంటి సమయంలో ఒక్క మంత్రి కూడా లేకుండా, కనీసం ఆరోగ్య మంత్రి కూడా లేకుండా ఒంటరిగా పాలనా వ్యవహారాలు చూస్తూ ఉండడంతో విమర్శలకు గురికావలసి […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 3:58 pm
Follow us on


భారత దేశంలో మంత్రివర్గం అంటూ లేకుండా ఒక్కడిగానే ప్రభుత్వం సుదీర్ఘకాలం నడిపి రికార్డు సృష్టించిన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చివరకు నాలుగోసారి పదవి చేపట్టిన 29 రోజులకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు.

లాక్ డౌన్ కు రెండు రోజుల ముందే సీఎం పదవి చేపట్టిన ఆయన కీలకమైన ఇటువంటి సమయంలో ఒక్క మంత్రి కూడా లేకుండా, కనీసం ఆరోగ్య మంత్రి కూడా లేకుండా ఒంటరిగా పాలనా వ్యవహారాలు చూస్తూ ఉండడంతో విమర్శలకు గురికావలసి వచ్చింది.

గతంలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన బిఎస్ యడ్డియూరప్ప కర్ణాటకలో 26 రోజులపాటు మంత్రివర్గం లేకుండా ముఖ్యమంత్రి పదవిలో ఉండి రికార్డు సృష్టింస్తే, ఇప్పుడు చౌహన్ 29 రోజులపాటు ఉండి ఆ రికార్డును బద్దలు చేశారు. మొదట్లోనే మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి చౌహన్ ప్రయత్నం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి, బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైన 19 మంది ఎమ్యెల్యేలతో వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా కోర్కెలకు తలవంచలేక జాప్యం చేస్తూ వచ్చారు.

కమలనాథ్ మంత్రివర్గంలో ఉన్న తన మద్దతుదారులైన ఏడుగురికి కూడా మొదటే మంత్రి పదవులు ఇవ్వాలని, అందుకోసం 16 నుండి 22 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేయమని సింధియా చెబుతూ వచ్చారు. మొదటినే కాంగ్రెస్ ఫిరాయింపుదారులు అందరికి పదవులిస్తే మంత్రిపదవులు ఆశిస్తున్న బీజేపీ వర్గాలలో అసంతృప్తి ఏర్పడుతుందని, మొదటగా 5 నుండి 7 మందితో మంత్రివర్గ ఏర్పాటు చేద్దామని చౌహన్ ప్రతిపాదించారు. చివరకు ఆ విధంగానే ఇదు మందితో మంత్రివర్గం విస్తరించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత మరోసారి విస్తరణ ఉంటుందని సంకేతం ఇచ్చారు.

ఐదుగురిలో ఇద్దరు కాంగ్రెస్ వారున్నా సింధియాకు ప్రాబల్యం గల గ్వాలియర్ – చంబల్ ప్రాంతంలో ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. అదే విధంగా బీజేపీలోని తన ప్రత్యర్థులకు సహితం మంత్రిపదవులు దక్కకుండా చౌహన్ జాగ్రత్త పడ్డారు. 1984 నుండి ఎమ్యెల్యేగా గెలుస్తూ, మొన్నటి వరకు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న గోపాల్ భార్గవకు కూడా మంత్రిపదవి దక్కలేదు. చౌహన్ ను సీఎంగా మార్చవలసి వస్తే భార్గవను ఆ పదవిలోకి తీసుకు రావాలని మోదీ – అమిత్ షా భావిస్తూ ఉండడమే అందుకు కారణంగా కనిపిస్తున్నది.

ఈ మంత్రివర్గ విస్తరణతో సింధియా మద్దతుదారులు పెదవి విరుస్తున్నారు. “మహారాజ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టడానికి ఉపయోగించుకున్న బీజేపీ ఇప్పుడు మొండిచెయ్యి చూపిస్తున్నది” అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీలో చేరిక కొన్ని గంటలకే రాజ్యసభ సభ్యత్వం పొందిన సింధియా కేంద్ర మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ ఉండడంతో రాష్ట్రంలో మంత్రిపదవులు కోసం ఎక్కువగా పట్టు బట్టలేక పోతున్నారని వారు అసంతృత్తిలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఈ మంత్రివర్గ విస్తరణ మధ్యప్రదేశ్ బీజేపీలో మరిన్ని కుమ్ములాటలకు, మరింత అసంతృత్తికి దోహదపడే విధంగా ఉన్నట్లు చెప్పవచ్చు.