Munugode Polling Percentage: రాష్ట్రం తో పాటు దేశంలోనూ ఆసక్తి రేపిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం అర్ధరాత్రి ముగిసింది. ఊహించినట్టుగానే రికార్డు స్థాయిలో 93% ఓటింగ్ నమోదయింది. మొత్తం 2,41, 805 మంది ఓటర్లకు గాను 2,24,878 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 2018 సాధారణ ఎన్నికల్లో మధిర నియోజకవర్గం లో నమోదైన 91.27 శాతమే ఇప్పటిదాకా అత్యధికంగా ఉంది. అప్పుడు కూడా 91.07 శాతంతో మునుగోడు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. తాజాగా ఉప ఎన్నికల్లో గత రికార్డులను మొత్తం బద్దలు కొట్టింది. బుధవారం అర్ధరాత్రి వరకు టిఆర్ఎస్, బీజెపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్న ఘటనలతో పోలింగ్ రోజు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన నెలకొన్నది. కొన్ని చెదరు మదరు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కొన్ని చోట్ల ఈవీఎంలు మోరాయించాయి. అధికారులు పోలీసులు వాటిని చక్కదిద్దారు.

సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల తమకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. మర్రిగూడ మండలం శివన్న గూడెం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు చుట్టుముట్టారు. మునుగోడు మండల కేంద్రంలో బిజెపి నేతల ఇళ్లను ఓటర్లు చుట్టుముట్టారు. డబ్బులు, బస్సు చార్జీలు ఇస్తామని టిఆర్ఎస్ నేతలు ఫోన్ చేయడంతో తాము నవి ముంబై నుంచి వచ్చామని, కాని తమకు డబ్బులు ఇవ్వలేదంటూ గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామానికి చెందిన ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. మగవాళ్లకు మాత్రం వేలల్లో ఇచ్చారని, తమకు మాత్రం వందల్లోనే ఇచ్చి చిన్నచూపు చూశారని మర్రిగూడెం మండలంలోని మహిళా ఓటర్లు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించే దాకా ఓటు వేయబోమని రంగం తండా, హజీనా తండావాసులు భీష్మంచు కూర్చున్నారు. మంత్రి కేటీఆర్ వాళ్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వాళ్లు ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు.
ఉప ఎన్నికలకన్నింటికన్నా అధికం
మునుగోడు గ్రామీణ నియోజకవర్గమే కావచ్చు. కానీ ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ.. 2018లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 91.07 శాతం పోలింగ్ నమోదయింది. 2014 ఎన్నికల్లో 82.14% పోలింగ్ నమోదయింది. ఇది కూడా అప్పట్లో అత్యధికమే. ఈసారి కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అవుతుందని అధికారులు అంచనా వేశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే 93% పోలింగ్ నమోదయింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నారాయణఖేడ్, పాలేరు, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజురాబాద్, హుజుర్ నగర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అయితే వీటన్నింటిలో మునుగోడు లోనే అత్యధికంగా పోలింగ్ నమోదయింది. అంతకుముందు హుజూర్ నగర్ లో 84.75 %, దుబ్బాకలో 82.61%, నాగార్జునసాగర్ లో 88% హుజరాబాద్ లో 87% పోలింగ్ నమోదయింది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్దకు తరలించారు. అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.