TRS Party- Munugode By Poll: మునుగోడు.. తెలంగాణలో అంత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నిక ఇది. దేశంలో అంత్యంత ఖరీదైన ఎన్నికగా కూడా చెప్పుకుంటున్నారు. ఓటర్ల తీర్పు ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. 92 శాతం పోలీంగ్ నమోదు కావడంతో మూడు ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో దాదాపు అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌కే ఎడ్జ్ ఇచ్చాయి. గతంలో ఎగ్జిట్ పోల్ సర్వేలు కొన్ని ఒకవైపు మరికొన్ని ఇంకోవైపు ఇచ్చేవి. కానీ మునుగోడు ఎగ్జిట్ పోల్స్ మాత్రం అన్నీ టీఆర్‌ఎస్‌కే మొగ్గు చూపాయి. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రాజకీయ విశ్లేషకులు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలే వస్తాయని అంచనా వేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు అనుకూలించిన అంశాలు..
మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలించిన అంశాలు చాలా ఉన్నాయి. మొదటిది సంకేమ పథకాలు.. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే పెన్షన్లు ఆగిపోతాయేమో అనే ఆందోళన, పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు కావడం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా పెండింగ్‌లో ఉండడంతో టీఆర్‌ఎస్ రాకపోతే అవి ఆగిపోతాయనే ఆందోళనతో పథకాల లబ్ధిదారుల ఓట్లు గంపగుత్తాగా టీఆర్‌ఎసకు పడినట్లు అంచనా వేస్తున్నారు. ఇక రెండో కారణం… క్యాంపెయినింగ్.. గతంలో బీజేపీ మాత్రమే క్షేత్రస్థాయిలో క్యాంపెయిన్ చేస్తుందన్న అభిప్రాయం ఉండేది. మునుగోడులు దీనిని అన్ని పార్టీ పట్టుకున్నాయి. ముఖ్యమంగా టీఆర్‌ఎస్ బీజేపీని మించి క్షేత్రస్థాయికి వెళ్లింది. ఈమేరకు కేసీఆర్ బలగం మొత్తాన్ని మునుగోడులో మోహరించడం కారణం. మరో అంశం.. వామపక్షాల పొత్తు.. మునుగోడులో కమ్యూనిస్టులకు మంచి ఓటు బ్యాంకు ఉంది. ఈ ఎన్నికల్లో వామపక్షాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చాయి. బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టులంతా టీఆర్‌ఎస్‌కే ఓటు వేసినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డిపై వ్యతిరేకత కూడా టీఆర్‌ఎస్‌కు ఓట్లు పెరగడానికి కారణంగా చెబుతున్నారు.
బీజేపీకి కలిసి వచ్చే అంశాలు..
బీజేపీ దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు జీరో అనే చెప్పాలి. కానీ మునుగోడు ఎన్నికల ద్వారా బలం పుంచుకుంది. ఇందుకు మొదటి కారణం బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి కావడమే. నియోజవర్గంలో కోమటిరెడ్డి కుటుంబానికి మంచి పలుకుబడి, పట్టు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అనుకూలులంతా గంపగుత్తాగా బీజేపీకి ఓటు వేసి ఉంటారు. మరో అంశం కేంద్ర హోంమంత్రి స్వయంగా మునుగోడుకు వచ్చి బీజేపీని గెలిపించాలని కోరడం, హుజూరాబాద్, దుబ్బాక గెలుపు ఊపు మునుగోడులో కూడా కనిపించే అవకాశం ఉంది. పట్టణ ఓటర్లలో బీజేపీకి, యువకులు బీజేపీకి స్పష్టంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం ఆ పారీకి కలిసి వచ్చే అంశం. పోల్ మేనేజ్‌మెంట్‌లో కూడా రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు దీటుగా నిర్వహించారు. ఇది కూడా బీజేపీకి కలిసి వచ్చే విషయం. రాజగోపాల్‌రెడ్డి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం పొందిన వారు అనేకమంది ఉన్నారు. అలాంటి వారు, వారి ద్వారా ప్రభావితం అయ్యే వారు బీజేపీకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరో ప్రధాన బలం.. హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వేసిన వారు.. వీరంతా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇలాంటి వారు 40 వేల మంది వరకు ఉంటారని అంచనా.. వీరిలో సగం మంది బీజేపీకే ఓటు వేసి ఉంటారని భావిస్తున్నారు. ఇది ఆ పార్టీకి చాలా వరకు కలిసి వచ్చే అంశం.
తగ్గుతున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు..
మునుగోడులో ముక్కోణపు పోటీ జరిగినా.. కాంగ్రెస్ పోటీ నామమాత్రంగానే అనిపిస్తోంది. ఆ పార్టీ సిట్టింగ్ స్థానమే అయినా.. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడం, వెంకటరెడ్డి ప్రచారం చేయకపోవడం, రెండు అధికార పార్టీలకు దీటుగా కాంగ్రెస్ పోల్ మేనేజ్‌మెంట్ చేయకపోవడం కాంగ్రెస్‌వైపు ఓటర్లు మొగ్గు చూపలేదని తెలుస్తోంది. మరో ప్రధాన కారణం, కాంగ్రెస్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి కారణంగా కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదులు కూడా బీజేపీకి ఓటు వేసినట్లు అంచనా.

బీఎస్పీ ఓట్లు చీలిస్తే..
ముక్కోణపు పోటీలో బీఎస్పీ కూడా కొంత వరకు ఓట్లు చీల్చగలుగుతుందన్న అంచనాలు వస్తున్నాయి. బీఎస్పీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. మిగతా పార్టీలు రెడ్లకే టికెట్ ఇచ్చాయి. దీంతో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న మునుగోడులో బీఎస్పీ 20 నుంచి 25 వేల ఓట్లు చీలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. ఇదే జరిగితే ఎవరి ఓట్లు చీలుతాయి. ఎవరికి లబ్ధి జరుగుతుందన్న ఆందోళన బీజేపీ, టీఆర్‌ఎస్‌లో నెలకొంది. ఇక కాంగ్రెస్‌కు కూడా 25 నుంచి 30 వేల ఓట్లు మాత్రమే వస్తాయని భావిస్తున్నారు.
ఇన్ని కారణాల మధ్య.. ఓటర్లు ఎక్కువగా టీఆర్‌ఎస్‌వైపే మొగ్గు చూపారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 10 వేల మెజారీటీ రావొచ్చని కూడా చెబుతున్నారు. ఇక రెండో స్థానంలో బీజేపీ నిలుస్తుందని పేర్కొంటున్నారు. మొత్తంగా ఫలితం తేలాలంటే రెండు రోజులు వేచిచూడాలి!