Anti-Modi Politics- Jagan And KCR: శత్రువుకు శత్రువు తన మిత్రుడిగా పరిగణిస్తారు. కానీ మిత్రుడి శత్రువును కూడా ఆదరించి..భరించాల్సిన పరిస్థితి ఏపీ సీఎం జగన్ కు దాపురించింది. అనూహ్య పరిణామాలతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ వారసుడు అన్న ఏకైక కారణంతోనే జగన్ ను ఏపీ ప్రజలు, నాయకులు గుర్తించి నాయకత్వాన్ని కట్టబెట్టారు. అంతులేని విజయంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టారు. వాస్తవానికి జగన్ ఎంతో పెద్ద రాజకీయ నాయకుడు కాదు. జాతి కోసం, రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి కాదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంతులేని సంపదను మూటగట్టుకున్నారు. రెండే రెండు సార్లు కడప ఎంపీగా పదవి నిర్వర్తించారు. అటు తరువాత ఓ పార్టీ అధ్యక్షుడిగా, విపక్ష నేతగా, సీఎంగా అనతికాలంలోనే రాజకీయ కొలువులు సాధించారు. వీటన్నింటి వెనుక కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు కావడం. అయితే జగన్ నెత్తిన పాలుపోసింది మాత్రం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయే. ఆయన అడిగిన సీఎం పదవి ఇవ్వలేదు. పైగా సీబీఐ, ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించారు. విపరీతమైన సానుభూతి పనిచేసి తాను కలలు గన్న ఏపీ సీఎం పీఠం దక్కించుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చారు కానీ.. తనకు మింగుడుపడనిది ఒకటి ఎదురైంది. అదే అత్యధిక మెజార్టీతో మోదీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం. ఏ మాత్రం బలంలేని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చుంటే తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా సాగేదని జగన్ ఆశించారు. కానీ అలా వర్కవుట్ కాలేదు.

పొరుగు రాష్ట్రం తెలంగాణలో సన్నిహితుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. కానీ కేంద్రం విషయానికి వచ్చేసరికి మోదీ అంటే ఖేదం లేదు.. మోదం లేదన్నట్టు సాగుతోంది జగన్ వ్యవహార శైలి. తనపై బలమైన కేసులు ఉన్న నేపథ్యంలో కేంద్రంతో ఇచ్చుపుచ్చుకునే ధోరణితో జగన్ సాగుతున్నారు. అయితే తాను ఇస్తున్నది ఎక్కువ అయితే.. కేంద్రం తిరిగి ఇస్తున్నది చాలా తక్కువ అని జగన్ భావిస్తున్నారు. కేవలం తన సంక్షేమ పథకాలకు అప్పులకు మాత్రం అనుమతులిస్తున్నారు తప్పితే.. రాజకీయంగా తనకు మైలేజ్ కల్పించే ఏ విషయంలోనూ కేంద్రం సహకరించడం లేదని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు.. పోలవరంకు నిధులు లేవు. ప్రత్యేక రైల్వేజోన్ లేదు.. విభజన సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి ప్రతికూల అంశాలను అమలు చేస్తుండడంతో జగన్ లో అసహనం పెరిగింది. అది బీజేపీపై వ్యతిరేకత వచ్చేలా చేసింది. పైగా తన రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు, పవన్ ను దగ్గరకు చేర్చుకోవడంతో కూడా జగన్ లో అసహనం పెరగానికి కారణమైంది. లోలోపల బీజేపీపై కోపం ఉన్నా..రాజకీయంగా చాన్స్ కోసం మాత్రం జగన్ ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
నాడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, యూపీఏ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే సుపరిపాలన అందించారు. కాదు కాదు ఏకపక్షంగా పాలించి ప్రజల మన్ననలు అందుకున్నారు. అటువంటి పరిస్థితి మోదీ వల్ల తనకు దూరమైందని జగన్ భావిస్తున్నారు. తాను ఏది చేసినా రాష్ట్రంలో విపక్షాలు ఎదురుచెబుతుండడానికి మోదీ, షాలే కారణమని జగన్ అనుమానిస్తున్నారు. దానికి మూడు రాజధానుల ఇష్యూనే ఉదాహరణగా చెబుతున్నారు.

రాజధానులు అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం. కానీ ఈ విషయంలో తనకు కనీసం సహకరించడం లేదని వాపోతున్నారుట. పైగా రాష్ట్ర బీజేపీ నాయకులతో అమరావతికి మద్దతుగా ప్రకటనలు జారీచేస్తుండడాన్ని కూడా తప్పుపడుతున్నారు. అటు నిధుల పరంగా సహాయ నిరాకరణ చేస్తుండడంతో మంచి పాలన అందించలేకపోతున్నానన్న బాధ జగన్ లో వ్యక్తమవుతోందని సహచరులు చెబుతున్నారు. పైగా తనను రాజకీయంగా అణచివేసే కుట్రకు కూడా బీజేపీ పెద్దలు సహకరిస్తున్నారని జగన్ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ తో కలిసి ఎందుకు నడవకూడదన్న ప్రశ్న వైసీపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. అయితే తనపై ఉన్న కేసుల దృష్ట్యా ఆచీతూచీ వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొందని జగన్ వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు కేంద్రంతో సన్నిహితంగా ఉంటూనే.. రాజకీయాలు మలుపు తిరిగే క్షణం కేసీఆర్ తో కలిసే నడిచే విషయంలో ఒక జగన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.