
ఊరు అనగానే మన మనసులో ఎలాంటి భావాలు మెదులుతాయి? పూరి గుడిసెలు.. అపరిశుభ్రంగా ఉండే రోడ్లు.. నిరుపేద జీవులు.. మొత్తంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే జనాలు కనిపిస్తారు. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గ్రామం మాత్రం పూర్తి భిన్నమైనది. ఇక్కడ చూడ్డానికి ఒక్క గుడిసె కూడా కనిపించదు. పేరుకు మాత్రమే గ్రామం. కానీ.. ఊరు మొత్తం పట్టణంలా ఉంటుంది. ఇక్కడున్న సౌకర్యాలు చూశారంటే.. నోరెళ్ల బెట్టాల్సిందే. ఇంతకీ.. అది ఏ ఊరు? ఎక్కడుంది? అన్న వివరాలు చూద్దాం..
ఆ గ్రామం పేరు మాదాపర్. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ఇది భారత్ లోనే కాకుండా.. ఏకంగా దక్షిణ ఆసియాలోనే అత్యం సంపన్నమైన గ్రామంగా నిలిచింది. ఈ ఊళ్లో మొత్తం 7,600 ఇళ్లు ఉన్నాయి. ఇక, ఇక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు బ్యాంకుకు వెళ్లాలంటే.. ఖచ్చితంగా మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. కొన్ని మండల కేంద్రాల్లో ఒకటీ రెండు బ్యాంకులకు సంబంధించిన బ్రాంచీలు మాత్రమే ఉంటాయి. కానీ.. మదాపర్ లో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఏకంగా 17 బ్యాంకులు బ్రాంచీలు ఉన్నాయి. ఇక, ఇందులో ఉన్న డిపాజిట్లు చూస్తే.. ఔరా అనాల్సిందే. ఏకంగా 5 వేల కోట్ల పైచిలుకు డిపాజిట్లు ఉన్నాయి. గ్రామంలోని పోస్టాఫీసులోనూ మరో 200 కోట్లపైన ఉన్నాయి.
ఇక, ఈ గ్రామంలో ప్రపంచంలోని అన్ని ప్రసిద్ధ బ్రాండ్ల స్టోర్ లు కూడా ఉన్నాయి. విద్యా సంస్థలు కూడా అన్నీ ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల నుంచి కాలేజ్ వరకు ఉన్నాయి. అత్యాధునిక హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. ఈ గ్రామంలోని ప్రతీ ఇంటి నుంచి కనీసం ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. బ్రిటన్, అమెరికా, కెనడా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు.
ఈ విధంగా.. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ గ్రామం.. ఆర్థికంగా దక్షిణ ఆసియాలోనే అత్యంత సంపన్నమైన గ్రామంగా నిలిచింది. అయితే.. ఇంతగా ధనవంతులైన గ్రామస్తులు రోజూవారీ వ్యవసాయాన్ని వదులుకోలేదు. నిత్యం వ్యవసాయ పనులు చేస్తూనే ఉంటారు. ఇదీ.. మదాపర్ గ్రామం చరిత్ర.