Balashowry Vallabbhaneni: వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరనున్నారు. నేడు పవన్ సమక్షంలో జనసేనలో అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన బాలశౌరి ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో చర్చించాక జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల కిందటే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేశారు. ఆదివారం జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు.
దివంగత రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు 2004లో కాంగ్రెస్ పార్టీలోకి బాలశౌరి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు. జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన నేతగా గుర్తింపు పొందారు. కానీ మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. దీంతో పలుమార్లు పంచాయితీలు నడిచాయి. సీఎం జగన్ సైతం పేర్ని నానిని నియంత్రించలేదు. దీంతో ఎంపీ బాలశౌరి గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు టికెట్ నిరాకరించడంతో పార్టీలో ఉండడం అంత భావ్యం కాదని ఒక కీలక నిర్ణయానికి వచ్చారు. జనసేనలో చేరేందుకు సిద్ధపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున మచిలీపట్నం ఎంపీ స్థానానికి మరోసారి బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది.
గత ఐదు సంవత్సరాలుగా మచిలీపట్నం నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను ఎంపీగా చాలా రకాల సమస్యలకు పరిష్కార మార్గం చూపానని చెప్పుకొచ్చారు. పోలవరం, స్టీల్ ప్లాంట్ అంశాలపై పవన్ తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పవన్ అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తనతో పాటు చాలామంది జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీ విధానాలకు లోబడి పని చేస్తానని చెప్పుకొచ్చారు. 2004లో వైయస్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చానని.. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచానని.. బందరు పోర్టు నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. పోలవరం తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లుగా అనుకున్నంత జరగలేదని బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.