Nara Lokesh: రాంగోపాల్ వర్మ కు నారా లోకేష్ షాక్ ఇచ్చారు. వ్యూహం సినిమాకు సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహం సినిమాకు సంబంధించి ఇటీవలే క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ఈనెల 29న విడుదలకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎవరు ఆపలేరు అంటూ ఇటీవల ఆర్జీవి ట్విట్ చేశారు. ఇంతలోనే లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలను ప్రతివాదులుగా చేర్చారు. వ్యూహం సినిమా విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ఈనెల 26న విచారణ ఉంది.
వాస్తవానికి కొద్ది నెలల కిందటి ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. విడుదలకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఈ సినిమా రాజకీయ దురుద్దేశంతో తీశారని.. చంద్రబాబు మనోభావాలు దెబ్బతినేలా ఆయన పాత్రను చూపించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ నారా లోకేష్ సెన్సార్ బోర్డు కు ఫిర్యాదు చేశారు. దీంతో సినిమా విడుదల వాయిదా వేస్తూ సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రివైజ్డ్ కమిటీ సైతం పరిశీలించింది. ఇటీవలే తిరిగి సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇంతలోనే లోకేష్ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
” ఏపీ సీఎం జగన్ అంటే ఇష్టమని.. చంద్రబాబు, పవన్ అంటే తనకు నచ్చని రామ్గోపాల్వర్మ చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు. తన ఇష్టాయిష్టాలతో సినిమాలోని పాత్రలను నిర్ణయించుకున్నారు. చంద్రబాబును సినిమాలో తప్పుగా చూపించారు. ట్రైలర్ లో చూపించిన విధంగానే సినిమా మొత్తం ఉండే అవకాశం ఉంది. 70 ఏళ్ల జీవితంలో చంద్రబాబు నిబద్ధత, పారదర్శకతతో ఉన్నారు. ఈ సినిమాతో ఆయనను అపఖ్యాతి పాలు చేసే రాజకీయ శత్రువైన జగన్కు లబ్ధి పొందేలా చూస్తున్నారు. వాక్ స్వాతంత్రం పేరుతో దర్శక నిర్మాతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వీరి చర్యల వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం కూడా దెబ్బతింటుంది. వంగవీటి, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి చిత్రాలు వల్ల దర్శక నిర్మాతలకు ఎలాంటి లాభాలు రాలేదు. అయినా సరే మరోసారి అలాంటి సినిమానే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. నష్టాలు వస్తాయని తెలిసినా కేవలం జగన్ లాభం కలగడం కోసమే ఈ సినిమాను తీశారు. జగన్ వెనుక ఉండి ఈ సినిమాను తీయించారు ” అని నారా లోకేష్ పిటిషన్ లో పేర్కొన్నారు. తాజాగా ఎంపిటిసి పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఓటిటి, ఇతర ఆన్లైన్ వేదికల్లో విడుదల చేయవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27 కు వాయిదా వేసింది. దీంతో ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు అయ్యింది.