Lok Sabha Speaker Election
Lok Sabha Speaker Election: 72 ఏళ్ల భారత పార్లమెంటు చరిత్రలో లోక్‌సభ స్పీకర్ పదవికి తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. 18వ లోక్‌సభ కొలువుదీరిన వేళ.. స్పీకర్ ఎన్నికకు అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. సంప్రదాయం ప్రకారం స్పీకర్ పదవికి ఎన్డీఏ అభ్యర్థిని నిలపాలని నిర్ణయించింది. ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రి విపక్ష ఇండియా కూటమి నేతలతో మాట్లాడారు. అయితే విపక్ష కూటమి తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే.. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని తెలిపారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి అంగీకరించలేదు.
పోటీ పోటీ నామినేషన్లు..
స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ తరఫున ఓంబిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షం నుంచి కె.సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ పదవికి జరిగే ఎన్నికల్లో ఎన్డీయేకు గట్టి పోటీ తప్పదని గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే ఇండియా కూటమి మాత్రం గెలవకపోయినా బలం చాటుకునే అవకాశం దక్కిందని భావిస్తోంది.
తొలిసారి ఎన్నిక..
డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే షరతుకు అధికార ఎన్డీఏ కూటమి అంగీకరించకపోవడంతో స్పీకర్ పదవికి పోటీ పడాలని నిర్ణయించినట్లు ఇండియా కూటమి నేతలు తెలిపారు. 72 ఏళ్ల భారత ప్రజాస్వామ్య చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితికి అధికార ఎన్డీఏ కూటమే కారణమని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. స్పీకర్ పదవికి తాము మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని తాము కోరినట్లు వెల్లడించారు. సంప్రదాయానికి విరుద్ధంగా అధికార పక్షం వ్యవహరిస్తోందని విమర్శించారు.
షరతులతో మద్దతు వద్దు..
ఇక విపక్షాలు స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలపడంపై పీయూష్ గోయల్ మాట్లాడారు. షరతుల ఆధారంగా స్పీకర్ పదవికి మద్దతు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. లోక్‌సభ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఏ పార్టీకి చెందినవారు కాదన్నారు. వారు మొత్తం సభకు చెందినవారని ఆయన తెలిపారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Lok sabha speaker election for the first time in the history of the country