Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రెండుసార్లు ఎంపీగా గెలిచిన అభ్యర్థికి షాక్ ఇచ్చింది. ఆమె స్థానంలో కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో కలకలం నెలకొంది.
పంజాబ్ లోని చండీగఢ్ పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ తరఫున కిరణ్ ఖేర్ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో ఆమె వరుసగా విజయం సాధించారు.. రాజకీయాల్లోకి వచ్చే ముందు కిరణ్ ఖేర్ సినిమాల్లో నటించారు. టెలివిజన్ ధారావాహికల్లో ముఖ్యపాత్రలు పోషించారు. 90ల కాలంలో ఆమె వెండితెరను ఒక ఊపు ఊపారు. సినిమాలో నటించుకుంటూనే సీరియల్స్ లోనూ మెరిశారు. 1979లో గౌతమ్ బెర్రీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.1985లో విభేదాల వల్ల అతడికి విడాకులు ఇచ్చారు. అదే సంవత్సరంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ను వివాహం చేసుకున్నారు. కిరణ్, అనుపమ్ దంపతులకు సికిందర్ ఖేర్ అనే అబ్బాయి ఉన్నాడు. కిరణ్ ఖేర్ సినిమాల నుంచి విరామం తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో భారతీయ జనతా పార్టీ ఆమెకు చండీగఢ్ స్థానం టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2019లోనూ అదే స్థానం నుంచి ఆమె పోటీ చేయగా విజయం సాధించారు.
ఈసారి ఎన్నికల్లోనూ ఆమెకే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆమె స్థానంలో సంజయ్ టాండన్ కు బీజేపీ టికెట్ కేటాయించింది. సంజయ్ ఛత్తీస్ గడ్ మాజీ గవర్నర్ బలరాంజీ దాస్ టాండన్ కుమారుడు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి కో – ఇన్ ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఈ స్థానం నుంచి సత్యపాల్ జైన్, అరుణ్ సూద్ పేర్లు కూడా వినిపించాయి. అయితే బీజేపీ అధిష్టానం సంజయ్ వైపు మొగ్గుచూపింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ సంజయ్ కి ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు..
చండీగఢ్ పార్లమెంట్ స్థానానికి జూన్ 1న జరిగే చివరిదశ పోలింగ్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇటీవల ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పీఠానికి సంబంధించి బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. కాగా, చివరి దశలో పోలింగ్ జరిగే పార్లమెంటు స్థానాలకు సంబంధించి బుధవారం రాత్రి భారతీయ జనతా పార్టీ అధిష్టానం 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ లోని ఏడు, చండీగఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఒక్కో పార్లమెంటు స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది.. ఇప్పటివరకు 10 జాబితాల ద్వారా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది..
చండీగఢ్ స్థానానికి రెండుసార్లు ఎంపీగా పనిచేసిన కిరణ్ ఖేర్ కు ఎందుకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని బీజేపీ బయట పెట్టడం లేదు. ఆమెకు ఈ నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. పైగా రెండుసార్లు ఎంపీగా కూడా గెలిచారు. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ.. మొత్తానికి ఎన్నికల్లో కిరణ్ కు టికెట్ దక్కలేదు. అనూహ్యంగా సంజయ్ కి టికెట్ ఇచ్చి బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు టికెట్ కేటాయించిన నేపథ్యంలో సంజయ్ బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. తను పుట్టింది పంజాబ్ రాష్ట్రంలోనేనని.. తనకు చండీగఢ్ ప్రజలకు మధ్య విడదీయరాని బంధం ఉందని.. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అయితే ఈ పార్లమెంటు స్థానంపై ఆప్, కాంగ్రెస్ పార్టీ మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఓట్ల షేరింగ్ లో భాగంగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దింపనుంది.