Lok Sabha Election Results 2024: “తెలంగాణలో బిజెపికి అంత సీన్ లేదు. బిజెపి అధిష్టానం అనుకున్నట్టుగా సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మహా అయితే రెండు మూడు వస్తాయి. ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ 12 వరకు సీట్లు గెలుచుకుంటుంది. భారత రాష్ట్ర సమితికి ఆశాజనకంగా పరిస్థితి లేదు కాబట్టి.. ఒకటి లేదా రెండు స్థానాలు వస్తాయి” ఇవీ పార్లమెంటు ఎన్నికలకు ముందు తెలంగాణలో విశ్లేషకులు, రాజకీయ మేధావులు వెల్లడించిన అభిప్రాయం. కానీ ఎన్నికల ఫలితాలలో అవన్నీ గాలికి కొట్టుకుపోయాయి. అంతిమంగా ప్రజలు వినూత్నమైన తీర్పు ఇచ్చారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుంది. భారత రాష్ట్ర సమితి 39 స్థానాలలో విజయానందుకుంది. బిజెపి 8 శాసనసభ స్థానాలలో గెలుపును సాధించింది.. అయితే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో ఇందుకు విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా మార్చేశారు.. శాసనసభ ఎన్నికల్లో 39 స్థానాలు సాధించిన భారత భారత రాష్ట్ర సమితికి 0 సీట్లు ఇవ్వగా.. 8 సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీకి 8, 64 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లల్లో విజయాన్ని కట్టబెట్టారు.
వాస్తవానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను అంచనా వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఆవిష్కృతం కాలేదు.. చివరికి ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ లోనూ కాంగ్రెస్ పార్టీ విజయ సాధించలేదు.. అక్కడ బిజెపి అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. చేవెళ్ల, మల్కాజ్ గిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ స్థానాలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, బండి సంజయ్, అరవింద్, గోడం నగేష్, కిషన్ రెడ్డి విజయం సాధించారు. వాస్తవానికి ఈ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ప్రజా పాలన అని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించలేదని తెలుస్తోంది.
తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడం.. ఆ పార్టీలో జోష్ నింపుతున్నప్పటికీ.. కేంద్రంలో ఆ పార్టీ తక్కువ స్థానాలు గెలుచుకోవడం ఇబ్బంది కలిగిస్తోంది. వాస్తవానికి ఈసారి 400 సీట్లు సాధించాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 291 సీట్ల వరకే పరిమితమైంది. బిజెపి కేంద్రం టార్గెట్ గా పెట్టుకున్న 400 సీట్లకు 109 స్థానాల దూరంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 199 స్థానాలు దక్కించుకొని సంచలనం సృష్టించింది. అయితే ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ, ఇతర పక్షాల సహాయంతో కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయాలని పావులు కదుపుతోంది. మరోవైపు ఈ ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. కేంద్రంలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ పెద్దలు అంచనా వేసుకుంటుంటే.. ఇక్కడి నాయకులు మాత్రం జరిగిన నష్టాన్ని తలచుకుంటూ ఆవేదన చెందుతున్నారు.. అయితే ఈ సీట్లతో బిజెపి తెలంగాణ రాష్ట్రంలో విస్తరించే అవకాశాలు లేకపోలేదు. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. మునుపటిలాగా మోడీ దూకుడుగా వ్యవహరించేందుకు అవకాశం ఉండదు. అదొక్కటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి.. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కొంతలో కొంత సాంత్వన.. స్థూలంగా చెప్పాలంటే.. కేవలం ఆరు నెలల్లోనే తెలంగాణ ప్రజల మనోగతం మారింది.. అది మాత్రం స్పష్టం సుస్పష్టం.