
దేశంలో ఆవహించిన సెకండ్ వేవ్ ధాటికి మళ్లీ లాక్ డౌన్ దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు చేయిదాటిపోతుండడం.. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోవడం.. ఆక్సిజన్ కొరత.. మందులు, వ్యాక్సిన్ల డిమాండ్ దృష్ట్యా మళ్లీ మినీ లాక్ డౌన్ ల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
గత వారం రోజుల్లో దేశంలో పాజిటివిటీ రేటు 10శాతం దాటినా..ఆక్సిజన్, ఐసీయూ పడకల భర్తీ 60శాతం మించిన ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ తరహాలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం రాత్రి రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కరోనా కేసులు పెరిగిన చోట ఖచ్చితంగా లాక్ డౌన్ విధించనున్నట్టు కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టైంది.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పట్టణాలు, నగరాలు, జిల్లాలు, పాక్షిక పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ వార్డులు,పంచాయతీ ప్రాంతాలల్లో కఠిన నిబంధనలతో స్థానికంగా లాక్ డౌన్ విధించాలని కేంద్రం తాజాగా రాష్ట్రాలను ఆదేశించింది. రాత్రి కర్ఫ్యూ విధించడంతోపాటు అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన అన్నింటిపై ఆంక్షలు విధించాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఇక కరోనా కట్టడికి మాజీ సైనిక ఉద్యోగులు, నెహ్రూ యువకేంద్ర, ఎన్ఎస్ఎస్ కేంద్రాలకు చెందిన సభ్యుల సేవలను ఉపయోగించుకోవాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వం, ప్రైవేటు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రైల్వే కోచ్ లు, తాత్కాలిక ఆసుపత్రులన్నింటినీ ఉపయోగించుకోవాలి.