
కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వరుసగా లాక్‌డౌన్ ప్రకటిస్తున్నా అదేమీ సరిపోదని, మరింత దూకుడు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్ఫష్టం చేసింది. దాదాపు 300 కోట్ల జనాభా ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉన్నది. కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు దాదాపు 21 వేల మంది చనిపోయారు.
కోవిడ్19 నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అదనమ్ గెబ్రియాసిస్ సూచించారు. కోవిడ్19 రోగులను గుర్తించాలి, వారిని ఐసోలేట్ చేయాలి, అందరికీ కరోనా పరీక్షలు చేపట్టాలి, వారికి చికిత్స ఇవ్వాలంటూ టెడ్రోస్ హితవు పలికారు. సామాజిక, ఆర్థిక ఆంక్షలతో పాటు కఠిన నియమాలు పాటిస్తేనే కోవిడ్19ను ఎదుర్కోగలమని చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ లాంటి చర్యలను చేపట్టాయని, కానీ మహమ్మారి వైరస్‌లను తరిమేందుకు ఈ చర్యలు సరిపోవని పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలోనే వైరస్‌పై అటాక్ చేయాలని కూడా అన్ని దేశాలకు పిలుపు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలని సూచించారు.
ప్రజా ఆరోగ్య వ్యవస్థను విస్తరించాలని, పబ్లిక్ హెల్త్ వర్క్‌ఫోర్స్‌ను పెంచుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. కమ్యూనిటీ స్థాయిలోనే అనుమానిత కేసులను గుర్తించే వ్యవస్థను రూపొందించుకోవాలని చెప్పారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన వైద్య పరికరాల ఉత్పత్తిని, సామర్ధ్యాన్ని పెంచుకోవాలని పేర్కొన్నారు.