తెలంగాణలో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చింది. భారీగా కేసులు తగ్గాయి. దీంతో దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేస్తున్న కేసీఆర్ సర్కార్ తాజాగా మూడో సారి మరిన్ని సడలింపులు ఇచ్చే దిశగా ప్లాన్ చేస్తోంది. తొలి లాక్ డౌన్ లో ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చిన కేసీఆర్ సర్కార్ రెండో లాక్ డౌన్ లో 2 గంటల వరకు మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మూడో విడతలో పగలు మొత్తం సడలింపు ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణలో సాయంత్రం 5 వరకు లాక్ డన్ సడలింపు ఇచ్చే దిశగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది. ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట అనుమతి ఇవ్వనుంది. మొత్తంగా తెలంగాణలో సాయంత్రం 6 గంటల వరకు అందరికీ లాక్ డౌన్ నుంచి మినహాయింపు కలుగనుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కేబినెట్ భేటిని నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో నిర్వహించనున్న ఈ మంత్రి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్ డౌన్ మూడో విడతపై గత నెల 30న కేబినెట్ భేటి సమావేశమై 10 రోజులు పొడిగించింది. ఈనెల 9తో ఆ గడువు ముగుస్తోంది.నాడు మధ్యాహ్నం 2 గంటల వరకు మినహాయింపులు ఇచ్చింది. తాజాగా రేపు జరిగే కేబినెట్ లో సాయంత్రం 6 గంటల వరకు మినహాయింపులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
ప్రస్తుతం దుకాణాలు, వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నడుస్తాయి. వ్యాపారాలు అప్పటికే మూతపడుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ మినహాయింపును ఇచ్చి ఇళ్లకు వెళ్లడానికి మరో గంట అనుమతించాలనుకుంటోంది. రాత్రిపూట మాత్రం పకడ్బందీగా కర్ఫ్యూ అమలు చేయనుంది.
లాక్ డౌన్ తో ఆదాయానికి భారీ గండిపడింది. ఈ క్రమంలోనే వివిధ కార్యక్రమాలు, పథకాల అమలు దృష్ట్యా ఆదాయం అత్యవసరంగా మారింది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సడలింపు అనివార్యమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సాయంత్రం 5 గంటల వరకు వెసులుబాటు ఇస్తే రిజిస్ట్రేషన్లు, రవాణా, అబ్కారీ తదితర శాఖల ద్వారా మరింత ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం బావిస్తోంది.
మూడో కరోనా వేవ్ హెచ్చరికల నేపథ్యంలో దాన్ని ముందస్తుగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు పెద్దసంఖ్యలో వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు ఇస్తోంది. దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ నిన్న హైదరాబాద్ లో నిర్వహించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించేందుకు ఈనెల 9వ తేదీని నిర్ణయించారు.