
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రెండో దశ ఉధృతమవుతోంది. ఢిల్లీ సర్కార్ చేతులెత్తేస్తున్న పరిస్థితి నెలకొంది. పరిస్థితులు చేయిదాటిపోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో నేటి రాత్రి 10 గంటల నుంచి మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. లాక్ డౌన్ పై కేజ్రీవాల్ ఈరోజు లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తో సమావేశమయ్యారు. అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు తెలిపారు. కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలను వివరించారు.
ఇక ఢిల్లీలో లాక్ డౌన్ కాలంలో నిత్యావసరాలు, ఆహారం, వైద్యం సహా ఇతర అత్యవసర సేవలు కొనసాగుతాయని తెలిపారు. ప్రైవేటు కార్యలయాలన్నీ వర్క్ ఫ్రం హోం ద్వారానే నడపాలని కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపింది. వివాహాలు కేవలం 50మందితో జరుపుకోవాలని సూచించింది. ప్రత్యేకంగా దీనికి పాసులు జారీ చేస్తారు. వలస కార్మికులు వెళ్లిపోవద్దని లాక్ డౌన్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుందని కేజ్రీవాల్ ప్రకటించారు.
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. గత నాలుగురోజులుగా రోజుకు దాదాపు 25వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు, ఇన్ ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రుల్లో పడకల కొరత తీవ్రంగా ఉంది. నిత్యం ఈ స్థాయిలో రోగులు వస్తే వ్యవస్థ ప్రమాదంలో పడే చాన్స్ ఉంది.
ఈ క్రమంలోనే ఢిల్లీలో కరోనా కల్లోలంలో చేతులెత్తేసిన కేజ్రీవాల్ సర్కార్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని విన్నవించింది. అవసరమైతే సైన్యం సహాయం ఇవ్వాలని కోరింది. ఆక్సిజన్లు, ఇతర వైద్య అవసరాలు కావాలని విన్నవించింది.