
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తొలి కరోనా కేసు కనుగొన్న తరుణంలోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకొని అత్యంత కఠినమైన ఆంక్షలు విధించారు. అయినా కరోనా విజృభన తగ్గలేదు. కానీ ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు భారత్ కొంచం మెరుగైన స్థితిలో ఉంది. కోవిద్19 అరికట్టడానికి ప్రధాని మోదీ గత నెల 24 న దేశవ్యాప్తంగా 21 రోజుల కర్ఫ్యూ ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ఫ్యూ సడలించినట్లయితే, కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చాలా రాష్ట్రాల సీఎం లు కర్ఫ్యూను పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి మే 3వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. “దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నాం. ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తున్నాం. మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయకపోతే పరిస్థితులు మరింత దయనీయంగా మారేవి” అని మోడీ అన్నారు.
అత్యంత కఠిమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నప్పటికీ మహమ్మారి తన పంజా విసురుతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. ఈ తరుణంలో ప్రజల కష్టాల్ని ఎలా తగ్గించాలి.. తీవ్రతను కనిష్ఠానికి ఎలా పరిమితం చేయాలని నిరంతరం రాష్ట్రాలతో చర్చించి మే 3వరకు పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాం” అని మోడీ తెలిపారు.