కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత రెండు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ వల్ల పేదలు, వలస కూలీలు ఆకలితో ఆలమటించకూడదన్న లక్ష్యంతో సిఎం కేసీఆర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1500 చొప్పున నగదు, ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జూన్ నెలలోనూ పేదలకు ఉచిత నగదు, బియ్యం పంపిణీ కొనసాగించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 87.55 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి ఏప్రిల్, మే నెలలో ఉచితంగా నగదు పంపిణీతో పాటు బియ్యం అందజేసింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డు లింక్ అయిన వారికి గత నెలలో 74.07 లక్షల మంది కుటుంబాలకు, ఈ నెలలో 74.35 లక్షల మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రూ.1500 నగదుతో పాటు బియ్యం పంపిణీ చేసింది. దీని కోసం ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.2500 కోట్లను వెచ్చించింది. కాగా రాష్ట్రంలో నాలుగవ విడత లాక్ డౌన్ ఈ నెల 31వ తేదీ నాటితో ముగియనుంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. పైగా జిహెచ్‌ఎంసి పరిధిలోని జిల్లాల్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దీని ప్రభావం పొరుగు జిల్లాలోనూ కనిపిస్తోంది.
అలాగే వలస కూలీలు కూడా మన రాష్ట్రానికి పెద్దసంఖ్యలో వస్తున్నారు. వారి వల్ల కూడా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ను పొడగించే అవకాశాలు అధికంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే పేదలు పలు రకాల ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ మరోసారి వారిని ఆదుకోవాలని నిర్ణయించారు. జూన్ నెలలో కూడా లబ్దిదారులందరికి ఉచితంగా బియ్యం, నగదు ఇవ్వాలని సిఎం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై బుధవారం జరిగే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
