Threats To Ministers: ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకిరాగానే ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ పై ఫోకస్ పెట్టింది, వేలాది మందిని బాధితులుగా మార్చుతున్న జూదాన్ని నిషేధించింది. పూర్తిగా ఉక్కుపాదం మోపింది. ఈ ఆన్ లైన్ జూదంతో వేలాది కుటుంబాలు బలిపశువులుగా మారుతున్న దృష్ట్యా కఠిన నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజల బాధలను పరిగణలోకి తీసుకొని దీనిని పటిష్టంగా అమలుచేసింది. ఇది హర్షించదగ్గ పరిణామమే అని అప్పుడు ప్రభుత్వ నిర్ణయంపై అందరూ అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా బాధిత కుటుంబాలు అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. కానీ ఇప్పడు లోన్ యాప్స్ హింస ఏపీలో ప్రారంభమైంది. ఏకంగా మంత్రులకే నేరుగా లోన్ యాప్స్ నిర్వాహకులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఆన్ లైన్ జూదంపై నిర్ణయం తీసుకున్నట్టుగా …లోన్ యాప్స్ విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షాత్ మంత్రులు, మాజీ మంత్రులకు ఫోన్ చేసి మీరు రుణం కట్టకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది.

అప్పు చేసింది ఒకరైతే…
ప్రస్తుతం అప్పులు సర్వసాధారణం. కొవిడ్ తరువాత ప్రతిఒక్కరి ఆర్థిక పరిస్థితి దిగజారింది. అప్పు చేయక తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. ఇంటి అవసరాలకు, పిల్లల చదువులకు, పెళ్లిల్లకు అప్పులు చేయడం అనివార్యంగా మారింది. అంతెందుకు అప్పుచేయనిదే ప్రభుత్వ పాలన కూడా సవ్యంగా నడిచే పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. అటువంటిది సామాన్యుడి పరిస్థితి చెప్పనక్కర్లేదు. అయితే దీనిని సొమ్ము చేసుకుంటున్న లోన్ యాప్ లు. నిమిషాల్లోనే రుణం.. పేపర్ లెస్ అప్పులు.. తక్కువ వడ్డీ అంటూ సరికొత్తగా ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటనలు జారీచేస్తున్నాయి. దీంతో ఆకర్షితులవుతున్న వారు లోన్ యాప్స్ మాయలో పడిపోతున్నారు. నిమిషాల వ్యవధిలో లోన్ వస్తుండడంతో యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. మరికొందర్ని యాప్స్ కి దగ్గర చేస్తున్నారు. ఇదో సైక్లింగ్ వ్యాపారంలా మారిపోయింది. అయితే ఎవరైతే అప్పు తీసుకున్నారో వారినే అడగాలి. వారి దగ్గర డబ్బులు ఉంటే చెల్లిస్తారు. లేకుంటే లేవని.. మరో రోజు ఇస్తామని చెప్పకుంటారు. అయితే ఎవరో చేసిన అప్పులకు వేరే వాళ్లను లోన్ యాప్స్ నిర్వాహకులు బాధ్యులను చేస్తున్నారు. మీరే బాకీ తీర్చాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటివరకూ సామాన్యులకే బెదిరింపులు రాగా.. కొత్తగా ఆ జాబితాలో మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేరుతున్నారు. బాధితులుగా మారుతున్నారు.
నెల్లూరు నేతలే బాధితులు..
నెల్లూరు జిల్లాలో ఇటువంటి ఘటనలే వెలుగుచూశాయి. సాక్షాత్ ఆ జిల్లా తాజా, మాజీ మంత్రులు కాకాని గోవర్థన్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్ లకు లోన్ యాప్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. మీ పేరిట లోన్ తీసుకున్నారు. చెల్లించండి అంటూ డిమాండ్ చేశారు. తక్షణం లోన్ అమౌంట్ చెల్లించాలని కూడా హుకుం జారీ చేశారు. అయితే తాము నగదు తీసుకోలేదని చెప్పినా వారు వినలేదు. వెంటనే చెల్లించాల్సిందేనంటూ తెల్చిచెప్పారు. అంతటితో ఆగకుండా బెదిరింపుల పర్వానికి దిగారు. అయితే దీనిపై మంత్రి కాకాని గట్టిగానే ఫోకస్ పెట్టారు. రూ.25 వేలు అందించి లోన్ యాప్ నిర్వాహకులను ట్రాప్ చేసి పోలీసులకు పట్టించారు. అనీల్ కుమార్ యాదవ్ మాత్రం ఇంకా లోన్ యాప్స్ నిర్వాహకుల నుంచి తప్పించుకోలేదు. ఇంకా ఆయనకు కాల్స్ వస్తునే ఉన్నాయని తెలుస్తోంది. అనీల్ తో యాప్స్ కు చెందిన ఓ మహిళ మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి బయటకు వచ్చింది. ఇది పెద్ద కలకలమే సృష్టిస్తోంది. అధికార పార్టీలో పెద్దతలకాయల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు లోన్ యాప్స్ ఏ విధంగా చికాకుపెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

సర్కారు ఉదాసీనం..
అయితే ఇంతా జరుగుతున్నజగన్ సర్కారు స్పందించడం లేదు. సాక్షాత్ తమ కేబినెట్ లో మంత్రి, మాజీ మంత్రికే బెదిరింపులు వచ్చినా స్పందించడం లేదు. లోన్ యాప్స్ ను కట్టడి చేయడం ప్రభుత్వానికి చిన్నపనే. ఇప్పటికే జూదం, లాటరీ వంటి వాటినినిషేధించిన మంచి పేరు ప్రభుత్వానికి ఉంది. ఆన్ లైన్ సినిమా టిక్కెట్లు, చేపలు, మాంసం నేరుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ప్రభుత్వానికి లోన్ యాప్స్ ను కట్టడి చేయడం ఏమంత పెద్ద పనికాదు. కానీ ఎందులో ఈ విషయంలో జగన్ సర్కారు వెనుకడుగు వేయడం మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది. రకరకాల కథనాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెడుతుందో? లేదో? చూడాలి మరీ.