BRS : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మూడు ప్రధాన పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. అయితే అధికార బీఆర్‌ఎస్ విపక్షాల కంటే ఒక అడుగు ముందే ఉండాలనుకుంటోంది. ఈసారి కూడా అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష బీజేపీ, కాంగ్రెస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాబితా రెడీ చేశారు. నిజ శ్రావణం ప్రారంభం కాగానే లిస్ట్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆగస్టు 17 లేదా 19న ప్రకటన…
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 17 లేదా 19 బీఆర్‌ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో 80 నుంచి 90 మంది పేర్లు ఉంటాయని గులాబీ నేతల గుసగుస. 80 శాతం సీట్లు సిట్టింగ్‌లకే కేటాయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 29 స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. వామపక్షాలకు రెండో జాబితాలో కొన్ని సీట్లు కేటాయించే ఛాన్స్ ఉందని సమాచారం.
ముందు ప్రకటించే సంప్రదాయం కొనసాగింపు..
అన్నింట్లో ముందుండే బీఆర్‌ఎస్ బాస్.. గత రెండు విడతల్లోనూ అభ్యర్థుల జాబితాను ఎన్నిలకు చాలా ముందుగా ప్రకటించారు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగించాలని భావిస్తున్నారు. ఏది చేసినా సెన్సేషన్ చేయడమే అలవాటుగా మార్చుకున్న సీఎం కేసీఆర్ ఈసారి కూడా ఏదో అద్భుతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బలాబలాల బేరీజు…
తెలంగాణలో ఇప్పటికే రాష్ట్రమంతా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. నాయకులంతా క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకుని అనుసరించాల్సిన వ్యూహాలను రెడీ చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా దానికి ముందు జరుపుకోవాల్సిన ఏర్పాట్లను చకచకా చేసుకుంటున్నారు. పార్టీల అధినేతలు కూడా సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటికే జాబితాను ప్రకటిం చాల్సి ఉన్నా అధిక శ్రావణం ఆటంకంగా మారింది. నిజశ్రావణం ప్రవేశించడంతోనే తమతమ అభ్యర్థులను అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు.
సింట్టింగులతోనే ముందుకు..
సిట్టింగులతో పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులున్నా…. అందుకు మించి ప్రయోజనాలే ఉన్నట్టు పలు విచారణల్లో తెలుసుకున్న అధినేత వారికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రకటించబోతున్న ఈ లిస్ట్‌లో అందరి ఊహలకు చరమగీతం పడుతూ, అందరి అంచనాలు పటా పంచలు చేస్తూ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తెలియవస్తోంది. పాతవారిపై తీవ్ర విముఖత, పార్టీ విధివిధానాలకు భంగం కలిగించేలా వ్యవహరించిన తీరు, కిందిస్థాయిలో శ్రేణులకు ఎదురవుతున్న చేదు అనుభవాలు, ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి జ్వాలలు ఆధారంగా 29 మందిని తప్పించారని తెలుస్తోంది.