Kerala Liquor Scam
Liquor Scam : జైలు నుంచి విడుదలైన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ వ్యవహారాలను వేగవంతం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఉద్యమిస్తున్నారు.. తెలంగాణ జాగృతి నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై విమర్శలు చేస్తున్నారు. ఇవి ఇలా ఉండగానే కవిత పై కేరళ విపక్ష నేత సతీషన్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మలపురం జిల్లాలోని ఎడవన్న ప్రాంతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కీలక వివరాలను వెల్లడించారు. “2003లో ఈ కుంభకోణం జరిగింది. అప్పట్లో పాలక్కాడ్ జిల్లాలోని ఎలపల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద భూములు కొన్నారు. ఆ తర్వాత ఆ కంపెనీకి అనుకూలంగా మద్యం విధానంలో సవరణలు చేశారు. అంతేకాదు మద్యం తయారు చేయడానికి ఆ కంపెనీకి అనుమతులు ఇచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ దూకుడుగా వ్యవహరించారు. ఎక్సైజ్ మంత్రి రాజేష్ ను సంప్రదించకుండానే శాఖ పక్షంగా అనుమతులు ఇచ్చారు. ఈ తతంగాన్ని మొత్తం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముందుండి నడిపించారు. ఆమె అప్పట్లో కేరళ వచ్చారు. ప్రభుత్వ పెద్దలను కలిసి.. చర్చలు జరిపారు.. నేను చేస్తున్న ఆరోపణలకు క్యాబినెట్ నోట్ ఆధారం. నేను మీడియాకు క్యాబినెట్ నోట్ విడుదల చేస్తే.. అది నకిలీదని మంత్రి ఖండించలేదు. ఓయాసిస్ కోసం మద్యం విధానాన్ని పూర్తిగా సవరించారు. దుకాణాల కేటాయింపులోనూ ఇదే విధానాన్ని అనుసరించారు. ఒయాసిస్ కంపెనీకి అనుమతులు వచ్చిన విషయం పాలక్కాడ్ జిల్లాలోని డిస్టిల్లరీలకు కూడా తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2023లో మధ్య విధానం అమల్లోకి రావడంతోనే ఒయాసిస్ కంపెనీ కి యూనిట్ నిర్వహణకు అనుమతులు వచ్చేశాయి. అయితే ఈ వ్యవహారంలో కవిత పాత్ర గురించి మరింత లోతుగా పరిశోధించాల్సి ఉంది. ఆమె కేరళలో ఎక్కడ ఉన్నారు? ఎక్కడ బస చేశారు? ఏం మార్గంలో ఆమె వచ్చారు? ఆమె కలిసిన ప్రభుత్వ పెద్దలు ఎవరు? ఈ వ్యవహారంలో ఆమెకు అండగా ఉన్నవారు ఎవరు?” అనే విషయాలపై మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని సతీషన్ ఆరోపించారు.
అక్కడ కూడా కేసులు
ఒయాసిస్ కంపెనీ పంజాబ్, మధ్యప్రదేశ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. పంజాబ్ రాష్ట్రంలో భూగర్భ జలాలను తీవ్రంగా కలుషితం చేస్తోందనే ఆరోపణలు ఓయాసిస్ కంపెనీపై ఉన్నాయి. ఈ కంపెనీ పై సతీషన్ అనేక రకాలుగా ఆరోపణలు చేసినప్పటికీ ఇంతవరకు ఒయాసిస్ యాజమాన్యం స్పందించలేదు..” నేను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగినప్పుడు పాలక్కాడ్ ప్రాంతంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. అందువల్ల అనేక ప్రాజెక్టులను తిరస్కరించాల్సి వచ్చింది. ఒయాసిస్ కంపెనీ 8 కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తుంది.. అలాంటి కంపెనీకి ఎలా అనుమతులు ఇచ్చారని” సతీషన్ ఆరోపించారు. మరోవైపు ఈ ఆరోపణలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇవి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలకు ఉదాహరణ అని మండిపడ్డారు. ఇటువంటి చిల్లర ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగానే ముందుకెళ్తామని ఆమె పేర్కొన్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Liquor scam allegations against mlc kavitha in kerala
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com