Munugode Bypoll- Left Parties:శ్మశానం ముందు ముగ్గు ఉండదు. రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు. అప్పుడప్పుడో మోహన్ బాబు నటించిన కలెక్టర్ గారు సినిమాలో పాపులర్ డైలాగ్ ఇది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఓటు బ్యాంకు రాజకీయం కోసం పార్టీ కార్యకర్తను నడిరోడ్డు మీద హత్య చేసినా ఇంతవరకు దర్యాప్తులో కీలకమైన ముందడుగు పడలేదు. పైగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి స్వయానా కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కి తమ్ముడు. అతడిని కాపాడేందుకే పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైగా మునుగోడు ఉప ఎన్నికల్లో సహకారం అందిస్తామని ఆ కమ్యూనిస్టు పార్టీ నాయకుడి నుంచి సంకేతాలు రావడంతో సీన్ మొత్తం మారిపోయిందని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బయటికి ఏవేవో మాటలు అనుకుంటారు కానీ ప్రగతిభవన్ తో కమ్యూనిస్టు నాయకులకు మంచి సంబంధాలే ఉన్నాయి. నాగార్జునసాగర్, హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల్లో ఇది చాలావరకు ప్రస్ఫుటమైంది. పేరుకు సామ్రాజ్యవాద, దోపిడి ప్రభుత్వాలపై పోరాడుదామని కమ్యూనిస్టు నాయకులు పిలుపునిస్తారు కానీ.. చేతుల్లో ఆ చేవ ఉండదు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన అంటే త్వరలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా పాల్గొంటున్నాయి. ఈనెల 20న సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారు. మరుసటి రోజు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్థానిక కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వారందరినీ సీఎం కేసీఆర్ వద్దకు మంత్రి జగదీశ్ రెడ్డి తీసుకెళ్లినా మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. దీంతో డైలమాలో పడిన జగదీష్ రెడ్డి స్థానికంగా కసరత్తు ప్రారంభించారు. అయితే ఆయన మాటలను కేడర్ అంతగా లక్ష్య పెట్టడం లేదు. పైగా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వల విసురుతుండటంతో వారంతా అటు వైపు మళ్లుతున్నారు.

కమ్యూనిస్టులతో లాలూచీ
మునుగోడు లో ఒకప్పుడు కమ్యూనిస్టుల హవా నడిచింది. పలుమార్లు ఆ పార్టీ కి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది. అది మునుగోడులో అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్దేశించగలుగుతుంది. అయితే కమ్యూనిస్టులు మొదటి నుంచి బిజెపికి వ్యతిరేకం కనుక ఎట్టి పరిస్థితుల్లో కమలం పార్టీ అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉండదు. మరో వైపు పోటీలో అభ్యర్థిని నిలిపే సాహసం కమ్యూనిస్టులు చేయడం లేదని తెలుస్తోంది. దీని వెనుక ఉన్న కారణమే ఆసక్తికరంగా అనిపిస్తోంది.
Also Read: Gautam Adani: అదానీ ప్రాణాలకు మోడీ భద్రత
తెల్దారుపల్లి ఘటనను ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు
ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఆగస్టు 15న టిఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. దీని వెనక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన, అతడి అనుచరులు పరారీలో ఉన్నారు. వారిని వెతికేందుకు ప్రత్యేక బలగాలు గాలిస్తున్నాయి. అయితే కృష్ణయ్య హత్య తర్వాత ఆయన కుటుంబాన్ని కేవలం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు మాత్రమే పరామర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా అటుబీవైపు చూడలేదు. మరి ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ ఘటన గురించి ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. వాస్తవానికి పువ్వాడ అజయ్ కి, కమ్యూనిస్టులకి మంచి సంబంధాలే ఉన్నాయి. సీఎంవో కూడా ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. అయితే ప్రస్తుతం కృష్ణయ్య హత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటేశ్వరరావును కాపాడితే మునుగోడులో సహకరిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం నుంచి సంకేతాలు రావడంతోనే కోటేశ్వరరావు పై చర్యలు తీసుకోవడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే కృష్ణయ్య బంధువులు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ ఘటనతో డైలమాలో పడ్డారు. ఘటనపై ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. “బయట పరిస్థితులు బాగా లేవు. జాగ్రత్తగా ఉండండి” అని మాత్రమే చెప్పి వెళ్ళిపోతున్నారు. మొన్నటి ఖమ్మం పర్యటనలో 2023 లో టికెట్ మీకే కేటాయిస్తామని కేటీఆర్ తుమ్మలకు హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. తెల్దారుపల్లి ఘటనలో చనిపోయింది తుమ్మల ప్రధాన అనుచరుడు. అధిష్టానం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడం, పోలీసులు కూడా అజయ్ చెప్పినట్టే వింటుండడంతో తుమ్మల నాగేశ్వరరావు కూడా డైలమాలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వాతంత్ర వజ్రోత్సవాలకు ఆయన అనుచరులు దూరంగా ఉన్నారు. పైగా జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తుమ్మలకు ఎటువంటి ఆహ్వానం అందడంలేదు. దీనిని బట్టి ఆయన కూడా తన ఆలోచనను మార్చుకునే యోచనలోనే ఉన్నారని కేడర్ అంటున్నారు. అయితే కృష్ణయ్య హత్య తర్వాత గ్రామంలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి. ఇప్పటికే కోటేశ్వరరావు చెందిన ఆస్తులను కృష్ణయ్య అనుచరులు ధ్వంసం చేశారు. హత్య విషయాన్ని ప్రస్తావించని సీపీఎం నాయకులు ఆస్తులు ధ్వంసం చేయగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కూడా కృష్ణయ్య వర్గానికి చెందిన 17 మందిపై కేసులు నమోదు చేశారు. గ్రామంలో పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆధ్వర్యంలో పోలీస్ పికెట్ జరుగుతున్నా.. ఈ క్షణంలో ఏమవుతుందోనని అక్కడి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తమ్మినేని వీరభద్రం నుంచి సంకేతాలు వచ్చినా.. మునుగోడు స్థానిక నాయకత్వం మాత్రం ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Also Read:World Most Polluted Cities 2022: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా.. ఢిల్లీ ఫస్ట్