
TSPSC Paper Leakage : గ్రూప్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించే ఇంటర్వ్యూలను రద్దు చేసిన సమయంలో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. ఇంటర్వ్యూల ద్వారా తమకు కావాల్సిన వారికి ఎక్కువ మార్కులను వేస్తారనే అపవాదు చాలా కాలం నుంచి ఉంది. దాంతో ఈ ఇంటర్వ్యూ పద్ధతి పట్ల పలువురు అభ్యర్థులు వ్యతిరేక భావంతో ఉన్నారు. దీనిని అంచనా వేసిన ప్రభుత్వం అన్ని రకాల పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. నేరుగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల మెజారిటీ అభ్యర్థుల నుంచి సానుకూలత వ్యక్తమయింది. కానీ, పేపర్ లీకేజీ వంటి ఘటనలతో ప్రభుత్వానికి కొంత చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది.
లక్ష్యం నెరవేరదు
పేపర్ లీకేజీ నేపథ్యంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల్లో ఎక్కువ శాతం నియామకాలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం కూడా నెరవేరదు. అదే జరిగితే.. ఉద్యోగార్థుల్లో నెలకొనే అసంతృప్తి కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది డిసెంబరులో జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. ప్రకటించిన ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఆలోగా భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఇప్పటివరకు 66,286 పోస్టుల భర్తీ కోసం పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇంకా సుమారు 13 వేల పోస్టులకు పైగా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ అనుమతులు వచ్చిన పోస్టుల్లో కొన్నింటి భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. కొన్ని పోస్టుల కోసం ఇప్పటికే పరీక్షలు నిర్వహించారు. ఇంకొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. ఈ పోస్టుల భర్తీలో ప్రధానంగా టీఎ్‌సపీఎస్సీతోపాటు పోలీస్ నియామక బోర్డు, మెడికల్ బోర్డు, గురుకుల బోర్డులు ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. టీఎ్‌సపీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 23 వేల పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. ఇందులో 17 వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లను జారీ చేశారు.
ఒకేసారి 80 వేల పోస్టులు
ఒకేసారి 80 వేల పోస్టుల భర్తీని చేపట్టడంతో అదే స్థాయిలో అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. లక్షల సంఖ్యలో అభ్యర్థులు వివిధ కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారు. చాలా మంది ఇతర పనులు మానుకుని, ఉద్యోగాల కోసం చదువుతున్నారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాసేందుకు వారు ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల పేపర్ లీకేజీ వంటి సంఘటనలు జరుగుతుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. అనుకోని కారణాలతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించకపోతే తామంతా తీవ్రంగా నష్టపోతామన్న ఆందోళన వారిలో ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని, పేపర్ లీకేజీ వంటి వాటిని అరికట్టి.. అభ్యర్థుల్లో నెలకొంటున్న అనుమానం, అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంత ఈజీ కాదు
జాతీయ స్థాయిలో నిర్వహించే పలురకాల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని టీఎస్ పీఎస్సీ వివిధ పరీక్షలకు షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే పేపర్ లీకేజీ కారణంగా ఇప్పటికే రెండు రకాల పోస్టుల పరీక్షలను రద్దు చేశారు. ఏఈ పోస్టుల పరీక్షను కూడా రద్దు చేయాలని భావిస్తున్నారు. ఇలా అనుకోని కారణాలతో షెడ్యూల్‌లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడి తే.. వాటిని రీషెడ్యూల్ చేయడంలో ఇబ్బందులు తప్పవని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు నిర్ణయించిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం.. లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల కోసం ఈ ఏడాది మే 17న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 29న గ్రూపు-2 పోస్టుల పరీక్షలు, ఏప్రిల్ 24న అగ్రికల్చర్ ఆఫీసర్ల పరీక్షలు, మే 7న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు, మే 13న పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు, జూలై 1న గ్రూపు-4 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాలని టీఎ్‌సపీఎస్సీ అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయిలో జరిగే వివిధ పరీక్షలతోపాటు, రాష్ట్ర స్థాయిలో జరిగే.. టెన్త్, ఇంటర్, ఎంసెట్, ఇతర బోర్డుల నియామక పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలించి, ఇతర పరీక్షలు లేని రోజుల్లో ఈ పరీక్షలు ఉండేవిధంగా షెడ్యూల్‌ను రూపొందించారు. వీటిలో రద్దు, వాయిదా పడిన పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు.