Huzurabad bypoll: యుద్ధంలో ఎంత పెద్ద ప్రత్యర్థితోనైనా తలపడి గెలవొచ్చు. కానీ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే వారిని మాత్రం గెలవడం కష్టం. మనకున్న బలాలు, బలహీనతలు, ఎత్తుగడలు, సామర్థ్యం అంతా మనతో ఉండే వారికి తెలస్తుంది. వాటిని ప్రత్యర్థికి చేరవేస్తూ, మనని దెబ్బకొట్టే వారిని గుర్తించడం చాలా కష్టం. దీని ప్రభావం గెలుపోటములపై కచ్చితంగా ఉంటుంది. హుజురాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

లీకులే.. లీకులు
హుజూరాబాద్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. హుజూరాబాద్ ప్రజలపై పోటా పోటీగా వరాల జల్లు కురిపిస్తున్నాయి. తమ అభ్యర్థి గెలిస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ హామీలు ఇస్తున్నాయి. గ్రామాల్లో తిరుగుతూ కుల సంఘాలకు, యువజన సంఘాలకు ఆఫర్లు ఇస్తున్నాయి. సంఘానికి ఇంత అంటూ గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు ముట్టజెపుతున్నాయి. ఇదే క్రమంలో ఇతర పార్టీల నుంచి వసలను ఆహ్వానిస్తున్నాయి. తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని, పదవులు అందిస్తామని మభ్య పెడుతూ గ్రామాల్లో ఉండే నాయకులను ఇరు పార్టీలు లాక్కుంటున్నాయి. వీరితో పాటు వారి అనుచరులను కూడా పార్టీలలో చేర్చుకుంటున్నారు. అయితే ఇలా భారీగా వలసను ప్రోత్సహించడమే ఇప్పుడు రెండు పార్టీలకు తలనొప్పిగా మారింది. ఇలా చేరిన నాయకులు అంతర్గతంగా చర్చలను, దాని సారాంశాన్ని తమ ప్రత్యర్థి పార్టీకి చేరవేస్తున్నారు.
‘లీకు’ రాయుళ్లను గుర్తించలేక తలపట్టుకుంటున్న నాయకులు
ఇలా అంతర్గతంగా సాగే చర్చలను ఎవరు బయటకు లీక్ చేస్తున్నారో తెలియక ముఖ్య నాయకులు తలలు పట్టుకుంటున్నారు. భారీగా వలసలు ప్రోత్సహించిన క్రమంలో అందులో ఎవరు సమాచారాన్ని ప్రత్యర్ఙి పార్టీకి చేరవేస్తున్నారో తెలుసుకోవడం నాయకులకు కష్టంగా మారింది. గ్రామల్లో ఒక పార్టీ కుల సంఘానికి ఇంత అని డీల్ మాట్లాడుకొని వెళ్లిన వెంటనే ఆ విషయం ప్రత్యర్థి పార్టీకి తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నాయకులు వచ్చి వారి కంటే ఎక్కువే ముట్టజెప్పి ఓటు హామీని తీసుకెళ్లి పోతున్నారు. ఇలా రెండు పార్టీల నుంచి హుజూరాబాద్ లో ఉన్న కుల సంఘాలు, యువజన సంఘాలు లబ్ది పొందుతున్నాయి. తమకు రెండు పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయని, రెండింటి స్వీకరించి, ఎవరికి ఓటు వేయాలనే అంశాన్ని చివరి వరకు ఆలోచిస్తామని అక్కడి ఓ కుల సంఘం నేత చెప్పారు. ఎన్నికలకు వారం రోజుల ముందే ఇన్ని ప్రలోభాలు చేస్తే, ఇక ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.