
సాధారణంగా ఏపీలో సీఎం జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే ఏమాత్రం ఆలస్యం కాకుండా ఆ పార్టీ ముఖ్యులు రంగంలోకి దిగేస్తారు. తమ పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కౌంటర్ యాక్షన్ తో రెడీగా ఉంటారు. అవసరమైతే బూతును వాడుతారు. కానీ తాజాగా విచిత్ర పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా తెలంగాణ మంత్రులు వైఎస్ జగన్ ను, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నా వైసీపీ నేతలెవ్వరూ నోరు మెదపడం లేదు. కనీసం కౌంటర్ కూడా ఇవ్వడం లేదు..
ఇటీవల తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. అంతేకాకుండా కార్మిక నేతగా పేరున్న మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి మరణానికి వైఎస్ కారణమని సంచలన ఆరోపణ చేశారు. ఓ కార్యక్రమంలో పీజేఆర్ ను వేదికపై పిలవకపోవడంతో గుండెపోటుతో మరణించాడని అన్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలు తమ ఇష్టం వచ్చినట్లు పెట్టుకున్నారని అన్నారు.
గతంలో మంత్రి నిరంజన్ రెడ్డి జగన్ దొంగ అని పరుష వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని పేపర్లలో కథనాలు కూడా వచ్చాయి. అయితే ఇంతలా టీఆర్ఎస్ నాయకులు వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నా వారు కనీసం స్పందించకపోవడంపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇక కొందరు సోషల్ మీడియాలో ఇన్ని రోజులు జగన్ తో సత్సంబంధాలు ఎందుకు కొనసాగించారని కొందరు ప్రశ్నించగా.. తండ్రి తప్పు చేస్తే కొడుకు అలా చేయడనుకున్నామని అంటున్నారు.
ఇక గతంలో తమ నేతపై విమర్శలు చేస్తే చటుక్కున్న స్పందించే వైసీపీ నేతలు టీఆర్ఎస్ విషయంలో మాత్రం స్పందించడం లేదు. ఒకవేళ స్పందించినా ఏదో సమాధానం చెప్పామ్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందోనని తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.