Dalit Bandhu : దళితబంధు పథకం గురించి కేసీఆర్ గొప్పగా చెబుతాడు. కేటీఆర్ అహోఒహో అంటూ ప్రసంగాలిస్తాడు. కొప్పుల ఈశ్వర్ అయితే ఇంతటి పథకం ఎక్కడుందని ఎదురు ప్రశ్న వేస్తాడు. కానీ ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ అంతర్గత సమావేశంలో ‘దళితబంధులో మీరంతా వసూళ్లకు పాల్పడుతన్నారు. మీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇంకోసారి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే మీ తోకలు కత్తిరిస్తా’ అని హెచ్చరిస్తాడు. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో మాత్రం వసూళ్లదందా దర్జాగా సాగిపోతోంది. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 40 శాతం కమీషన్ సర్కారు అంటూ బీజేపీని దెప్పిపొడుస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు.. ఇక్కడ మాత్రం యథేచ్ఛగా వెనకేసుకుంటున్నారు.
ఉపాధి పథకంగా మారింది
దళితబంధు పథకం దళారుల పాలిట వరంగా, కొందరు రాజకీయ నాయకులకు ఉపాధి పథకంగా మారింది. యూనిట్ల ఎంపికలో పూర్తిగా రాజకీయ ప్రాధాన్యం కలిగిన దళితబంధులో లబ్ధిదారులంతా అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలే. కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇందులో లబ్ధిదారులుగా ఉండటం వి శేషం. ఒకవేళ బయటి లబ్ధిదారులెవరైనా ఉంటే దళారులు చేరి సగం పేరుతో మంజూరు చేయించారనే ఆరోపణలు వచ్చాయి. వెరసి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ కుటుంబపోషణే భారంగా మారిన అనేకమంది దళిత యువతకు ఈపథకంతో పెద్దగా ప్రయోజనం కలగలేదు. పేరుకు ప్రభుత్వ పథకమైనా అంతా రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపికలు జరిగాయి. లబ్ధిదారుల్లో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులకు బినామీలుగా మారినట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో మొత్తం 31మందికి దళితబంధు ద్వారా వాహనాలు, దుకాణాలు ఏర్పాటు మినహా మిగిలిన యూనిట్లు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదంటే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థిని అర్థం చేసుకోవచ్చు.

రూ.లక్షల్లో వసూలు
చోటామోటా బీఆర్‌ఎస్ నేతలు దళితబంధు యూనిట్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో లబ్ధిదారునుంచి రూ.రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో లబ్ధిదారులు పూర్తిస్థాయిలో యూనిట్లును ఏర్పాటు చేసులేకపోతున్నారు. అశ్వారావుపేట మండలానికి మంజూరైన 31యూనిట్లులో వాహనాలు తప్ప డెయిరీ, కోళ్లఫారాల వంటి పది యూనిట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. లబ్ధిదారులకు నిధులు పూర్తిస్థాయిలో రాలేదు. ఇక ఈ పథకంలో మంజూరైన వాహనాలను కొందరు లబ్ధిదారులు ఇప్పటికే అమ్మేసుకున్నట్టు తెలుస్తోంది. లీజు పేరుతో ఒకరికి మంజూరైన వాహనాలు వేరేవారి చేతికి వెళ్లిపోవడం బహిరంగ రహస్యమే.. కొద్దిరోజుల క్రితం అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడేనికి చెందిన ఓ మహిళ తనకు మంజూరైన దళితబంధు నిధులను కొందరు అధికారపార్టీకి చెందిన యువ నాయకులు కాజేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి ‘దళితబంధు’లో చేతివాటం బహిరంగంగా వెలుగులోకి వచ్చింది.
సమర్థించుకునే ప్రయత్నం
దీనిపై అధికారులు, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తమ తప్పేమీ లేదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మొత్తం యూనిట్ల వ్యవహారంలో భారీస్థాయిలో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార యంత్రాంగానికి కూడా యూనిట్లు ఏర్పాటులో పర్సంటేజీలు ముట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా దళితబంధు యూనిట్లలో అక్రమాలను సరిచేయాల్సిన అధికారులు అధికారపార్టీ ఒత్తిడులతో పథకం అమలులో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని సమర్దించుకునే ప్రయత్నం చేస్తూ అభాసుపాలవుతున్నారు