Telangana Congress: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఇన్నాళ్లకు టీ కాంగ్రెస్ కళ్ల ముందు ప్రత్యక్షమైంది. మాణిక్యం ఠాకూర్ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు.. తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లుగా ఉన్న పరిస్థితి మాణిక్‌రావ్ థాక్రే బాధ్యతలు చేపట్టాక మారిపోయినట్లు కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఈ పరిస్థితితో ఆ పార్టీ శ్రేణుల్లో పట్టరాని సంతోషం కనిపిస్తోంది. ఎన్నికల వరకైనా ఇలా అందరూ కలిసి ఉంటే బాగుండు అన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.

నాగర్‌కర్నూల్‌లో అందరూ ఒకే వేదికపై..
నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, నాగం జనార్దన్‌రెడ్డి, చిన్నారెడ్డితోపాటు జిల్లాకు చెందిన సీనియర్లంతా ఒక్కచోట కనిపించారు. సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, దళిత గిరిజనులను ఉద్దేశించి నేతలు మాట్లాడారు. దళితులు, గిరిజనులపై దాడులు చేస్తుంటే ఊరుకునేది లేదిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని అన్నారు.
సీఎం పీఠం కాంగ్రెస్‌దే..
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని రేవంత్ తెలిపారు. అధిష్టానం నిర్ణయించిన వారిని సీఎం గద్దెపై కూర్చోబెట్టే వరకూ విశ్రమించనని స్పష్టం చేశారు. దొరలకు బీఆర్‌ఎస్ ఉందని, పెట్టుబడిదారులకు బీజేపీ ఉందని.. దళిత, గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉందని పేర్కొన్నారు రేవంత్. రాష్ట్రంలో దళిత, గిరిజనులను బీఆర్‌ఎస్ నేతలు అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు దళితుడు కాదు దరిద్రుడు సీఎం అయ్యారని విమర్శించారు.
ఒక్కటయ్యాం.. కేసీఆర్‌ను తరిమికొడదాం..
ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్‌ను తరిమికొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. అధికారం శాశ్వతం కాదని, మర్రి జనార్దన్‌రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. టీపీసీసీ ఇన్‌చార్జిగా మాణిక్‌రావ్ థాక్రే వచ్చిన తర్వాత పార్టీలో గొడవలన్నీ సమసిపోయాయని రేవంత్ ఈ వేదిక ద్వారా క్యాడర్‌కు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు పార్టీలో నేతలమంతా కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ భరతం పడదామని, కేసీఆర్‌ను తరిమి కడదామని పిలుపునిచ్చారు.
దాడులను అడ్డుకుందాం..
కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే మాట్లాడుతూ.. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణలో సామాన్యులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ దాడులకు పాల్పడితే కాంగ్రెస్ ప్రజల తరఫున కాంగ్రెస్ పోరాడుతుందని, దాడులను అడ్డుకుంటుందని చెప్పారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు అందరి మద్దతు ఉండాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఇప్పటికీ దళిత, గిరిజనులపై దాడులు జరగడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. పోలీసులు తమ దోరణిని మార్చుకోవాలని హితవు పలికారు.

మొత్తంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతం కావడంతో పాలమూరు జిల్లా శ్రేణులతోపాటు, చాలా కాలం తర్వాత అందరినీ ఒక్కచోట చూసిన పార్టీ కేడర్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. కేసీఆర్ ను కలిసికట్టుగా ఓడించగలరన్న ధైర్యం కాంగ్రెస్‌లో వచ్చింది. ఇదంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమని కాంగ్రెస్ శ్రేణులు నమ్ముతున్నాయి.