KCR- BRS: ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాలని, బీజేపీని బంగాళాఖాతంలో కలుపడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. గుజరాత్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ దేశానికి ప్రధాని అయ్యాడు.. తానెందుకు దేశాన్ని ఏల కూడదు అన్న ఆలోచన ఆయనను జాతీయ రాజకీయాలవైపు మళ్లించింది. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుండడం, ఎనిమిదేళ్ల పాలనపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గులాబీ బాస్‌కు మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు తెలంగాణలో మరోమారు అధికారంలోకి రావడంతోపాటు కేంద్రంలోనూ చక్రం తిప్పేస్థాయికి ఎదగాలని భావించారు. ఈమేరకు ప్రత్యామ్నాయ వేదిక అంటూ కాలుకు పలపం కట్టుకుని వివిధ రాష్ట్రాల్లో తిరిగారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయాలనుకున్నారు. ఇందులోనూ తానే కీలకం కావాలని భావించారు. కానీ కేసీఆర్‌ను బీజేపీ వ్యతిరేక పార్టీలేవీ నమ్మలేదు. బీజేపీతో ఇన్నాళ్లూ కలిసి పనిచేసి ఇప్పుడు వ్యతిరేకం అని కేసీఆర్ చెప్పిన మాటలను విశ్వసించలేదు. దీంతో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. జాతీయ పార్టీ ప్రకటనతో బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసి వస్తాయని భావించారు గులాబీ బాస్. కానీ ఆశించిన మద్దతు కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆహ్వానించినా ఆవిర్భావానికి దూరం..
టీఆర్‌ఎస్ అధికారికంగా బీఆర్‌ఎస్ అవతరించింది. టీఆర్‌ఎస్ రాజకీయ ప్రస్థానంలో ఒక తంతు పూర్తయింది. బీఆర్‌ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. నూతన జాతీయ పార్టీని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ వేడుకకు కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఆహ్వానించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌తోపాటు అఖిలేశ్‌యాదవ్, కుమారస్వామితోపాటు వామపక్ష నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి కుమారస్వామి మినహా ఎవరూ రాలేదు. ఇప్పుడు ఇది బీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీని ప్రారంభించినా కేసీఆర్‌కు ఆ స్థాయిలో మద్దతు లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రారంభ వేడుకకు జాతీయ స్థాయిలో వచ్చిన నాయకులు దాదాపు ఎవరూ లేరనే చెప్పొచ్చు. కర్నాటక జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, దక్షిణాది ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ మాత్రమే హాజరవడంపై సొంతపార్టీలోనే గుసగుజలు వినిపిస్తున్నాయి.
ఎర్ర గులాబీలు ఎందుకు రానట్టు..?
తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఐదు ఉప ఎన్నిల్లో అధికార టీఆర్‌ఎస్‌కు వామపక్ష పార్టీలు బహిరంగంగా మద్దతు పలికాయి. మునుగోడు ఎన్నికల నాటి నుంచి కేసీఆర్‌తో ఆ పార్టీల నేతలు సన్నిహితంగా ఉంటున్నారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం రోజు ఆ నేతలంతా తెలంగాణలోనే ఉన్నారు. కార్యక్రమానికి రావాలని సీఎం కేసీఆర్ కోరినా కూడా రాకపోవడం గమనార్హం.

ఆకట్టుకోని ఆవిర్భావ ప్రసంగం..
జాతీయ స్థాయిలో ప్రధాని మోదీని ఢీకొట్టే నాయకుడిని తానే అంటూ ఏడాదిగా సీంఎ కేసీఆర్ బీరాలు పలకడం చూస్తున్నాం. దేశ గతిని మార్చేందుకు, తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆమేరకు తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఈమేరకు ఎన్నికల సంఘం కూడా పేరు మార్పునకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ను ప్రారంభిస్తున్న వేళ జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలెవరూ రాని పరిస్థితిలో… బీఆర్‌ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగం కూడా చప్పగా సాగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యామ్నాయ ముచ్చటలో పస లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఏదో మొక్కుబడి కార్యక్రమంలా సాగిపోయిందని చెబుతున్నారు. పార్టీ పేరులో తెలంగాణను పోగొట్టుకోవడం కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీపై దండయాత్ర చేసే క్రమంలో తన శక్తిసామర్థ్యాలు ఏంటో తెలియకుండా కేసీఆర్ యుద్ధానికి సిద్ధమయ్యారనే వాళ్లే ఎక్కువ. ఏది ఏమైనా కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం అంటే మాత్రం కేసీఆర్ ఒంటరి కావడం ఖాయం.