Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన పీసీసీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకుగాను రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. పార్టీ సీనియర్లను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ సభ్యత్వ కార్యక్రమం హైలైట్ చేయాలనుకున్నారు. కనీసంగా 30 లక్షల మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్చి రికార్డు క్రియేట్ చేయాలనుకున్నారు. అదే కానీ జరిగితే కాంగ్రెస్ పార్టీకి పట్టు లభించినట్లు కొంత మేరకు అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలకు రేవంత్ టార్గెట్ ఇచ్చారు. కానీ, ఆయా నియోజకవర్గ స్థాయి నేతలు రేవంత్ ఆదేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నియోజకవర్గంలో రెండు వేల సభ్యత్వాలు కూడా నమోదు కాలేదని వార్తలొస్తున్నాయి. ఇటువంటి నియోజకవర్గాలు దాదాపుగా 40 ఉన్నాయని తెలుస్తోంది. అయితే, రేవంత్ సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ లో మాత్రం 70వేల సభ్యత్వాలు నమోదయ్యాయి. దాంతో ఆ నియోజకవర్గ నేతలను రేవంత్ అభినందించారు. నియోజకవర్గ స్థాయి నేతలందరికీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని ఈ సందర్భంగా రేవంత్ వారికి హామీనిచ్చారు.
Also Read:బాలీవుడ్ : వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !
కొడంగల్ మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాలు నమోదు అయితే పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, సభ్యత్వ నమోదులో అందరూ కృషి చేస్తే కనుక అది ఆటోమేటిక్ గా రేవంత్ కు ప్లస్ అవుతుందని, అది కేవలం రేవంత్ ఖాతాలో పడిపోతుందని కొందరు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. అందుకే వారు ఈ కార్యక్రమాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదని వినికిడి. అయితే, పార్టీ సభ్యత్వాలు నమోదు చేయిస్తే పార్టీకే లాభం జరుగుతుందని, రేవంత్ రెడ్డికి కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ మొరను ఆలకించి అందరూ కలిసి కట్టుగా పార్టీ కోసం పని చేస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ సూచనను స్వీకరిస్తారో లేదో చూడాలి..
Also Read: టాలీవుడ్ జనవరి రివ్యూ : తొలి నెలలోని సినిమాలన్నీ విలవిల !