KCR : తెలంగాణలో ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. అటు చూస్తే కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. అధికార భారత రాష్ట్ర సమితికి అన్ని విషయాల్లోనూ సవాళ్లు విసురుతోంది.. పైగా భారత రాష్ట్ర సమితి నుంచి కీలకమైన నేతలను తన పార్టీలో చేర్చుకుంటున్నది. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, జడ్పీ చైర్మన్ లను, కీలకమైన నేతలకు కండువా కప్పి ఆహ్వానిస్తోంది. ఇది ఒక రకంగా ఎన్నికలకు ముందు కెసిఆర్ కు తలనొప్పి లాంటి పరిణామమే. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలు జరగడం పరిపాటి. కానీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉన్న భారత రాష్ట్ర సమితి నుంచి ఈ స్థాయిలో నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇదొక ట్రెండ్
సొంత పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తుండడం భారత రాష్ట్ర సమితి అధినేతకు ఇబ్బంది కలిగిస్తుండగా, కొంతమంది ఎమ్మెల్యేలకు మరలా టికెట్లు ఇవ్వద్దని సొంత పార్టీ నాయకులు ఆందోళనలు చేస్తుండడం కెసిఆర్ కు చిరాకు తెప్పిస్తోంది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి ఉండదనో అధిష్టానానికి నేరుగా సంకేతాలు పంపిస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులు అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీరికి టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి లేదని అధిష్టానానికి నేరుగా వ్యవహరిస్తున్నారు. ఇక నలగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే బాగత్, మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మీద అధికార పార్టీ నాయకులే ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని ఆధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.
సొంత పార్టీ నాయకులు నిరసన
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీద సొంత పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన పనితీరు బాగో లేకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని ఆరోపిస్తున్నారు. ఈ జిల్లాలు మాత్రమే కాకుండా మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందే సొంత పార్టీ నాయకులు ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి మళ్లీ టికెట్ ఇస్తే ఓటమి తప్పదనే అంచనాకు కెసిఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సొంత కార్యకర్తలే వ్యతిరేక స్వరం వినిపించడం భారత రాష్ట్ర సమితి పెద్దలను సందిగ్ధంలో పడేస్తోంది. మరి వీటి నివారణకు కేసిఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో?!