Telangana Assembly Election: రాజకీయ సభలు జరిగినప్పుడు వాటికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినట్టు చూపించుకోవడానికి.. మందు, బిర్యానీ, రూ.500 నుంచి రూ.1000 దాకా డబ్బులు ఇచ్చి చుట్టుపక్కల ఊళ్ల నుంచి జనాన్ని తరలించడం నేతలకు అలవాటే! కానీ… ఇప్పుడు పార్టీ మార్పిడి కార్యక్రమాలనూ విజయవంతమైనట్టుగా ప్రకటించుకోవడానికి, తమ పార్టీకి ఎక్కువ ప్రజాదరణ ఉందని చాటుకోవడానికి.. చేరికలకూ చెల్లింపులు చేసే నయా ట్రెండ్ జోరందుకుంది! ముఖ్యంగా రాజధాని హైదరాబాద్, ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక నియోజకవర్గంలో బీజేపీ నుంచి పలువురు నాయకులతోపాటు, వందమంది కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో తమ పార్టీలో చేరినట్టు అధికార బీఆర్‌ఎస్ గొప్పగా ప్రకటించుకుంది. కానీ.. ఆరోజు గులాబీ కండువా కప్పించుకున్నవారిలో ఇద్దరు ముగ్గురే బీజేపీ నేతలు. మిగతావారెవరికీ కాషాయపార్టీ సభ్యత్వం లేదు. వారంతా.. సదరు బీజేపీ నేతలు ఇచ్చే డబ్బు కోసమే వచ్చినవారు. కార్యక్రమం మాంచి హంగామాగా జరిగినట్టు చూపించుకోవడానికి ఆ నేతలు ‘చెల్లింపులు’ చేసి మరీ తెచ్చుకున్న ‘కిరాయి’ కార్యకర్తలు వారు!! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే మరో నియోజకవర్గంలోనూ.. కాంగ్రెస్ నేతలు చాలామంది కాషాయ కండువా కప్పుకొన్నట్టు బీజేపీ నేతలు ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ, వాస్తవమేంటంటే.. వారిలో చాలామంది సదరు కాంగ్రెస్ నేతలు డబ్బులిచ్చి వెంటేసుకెళ్లిన అడ్డాకూలీలే!!
ఎన్నికల షెడ్యూలుకు ముందే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. షెడ్యూలు ప్రకటించాక ఆ సెగ మరింత పెరిగింది. దీంతో.. ఇతర పార్టీలతో పోలిస్తే తమ పార్టీ బలంగా ఉందని చాటుకునేందుకు ప్రధాన పార్టీలు చేరికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇతర పార్టీల్లో టికెట్ ఆశిస్తూ.. వచ్చే అవకాశం లేనివారికి, అసంతృప్త నేతలకు గేలం వేస్తున్నాయి. దీంతో పార్టీ మార్పిడి కార్యక్రమాలు, చేరికలు జోరందుకున్నాయి. ముఖ్యంగా.. రాజధాని నగరంలో రెండుచోట్ల మినహా మిగతా అన్ని స్థానాల్లో సిటింగ్‌లకే అవకాశం కల్పించడంతో చేరికలపై బీఆర్‌ఎస్ ఫోకస్ పెంచింది. ఇతర పార్టీల నాయకులను పెద్ద ఎత్తున ఆకర్షించి గులాబీ కండువాలు కప్పుతోంది. ఇలా వారానికి కనీసం మూడు, నాలుగు ‘చేరికల’ కార్యక్రమాలు ఉండేలా పలువురు ఎమ్మెల్యేలు/అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన నియోజకవర్గ, డివిజన్, బూత్ స్థాయి నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ బాధ్యతను నమ్మకస్థులైన అనుచరులకు అప్పగించి, రహస్యంగా ఆపరేషన్ పూర్తయ్యేలా దిశానిర్దేశం చేస్తున్నారు. తరచూ చేరికల కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా.. బీఆర్‌ఎస్ బలం ఎక్కువగా ఉందనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు కూడా ఇదే తీరున వ్యవహరిస్తున్నాయి.
ఎంతమందొస్తరు?
పార్టీ మారడానికి సిద్ధమైన నేతలకు ఎదురవుతున్న ముఖ్యమైన ప్రశ్న.. ‘‘మీతోపాటు ఎంతమంది వస్తారు?’’ అనేదే! ఆ వివరాలు చెప్పాకే స్థానిక ఎమ్మెల్యే/అభ్యర్థులతో మాట్లాడిస్తున్నారు. దీంతో పార్టీ మారడానికి సిద్ధమైన నేతలు చేరిక రోజున తమ వెంట ఎక్కువ మంది ఉండేలా చూసుకుంటున్నారు. అలా వస్తున్నవారిలో సిసలైన అనుచరులు కొద్దిమందే కాగా.. అడ్డాకూలీలే ఎక్కువ మంది ఉంటున్నారు. వారు ఎప్పుడు రావాలో సమాచారం ఇచ్చి.. ‘జాయినింగ్ రోజు మంచి దుస్తులు వేసుకుని రావాలి’ అని సూచిస్తున్నారు. కార్యక్రమానికి వచ్చినందుకు బిర్యానీ, పెట్రోల్ ఖర్చులతోపాటు రూ.500 నుంచి రూ.1000 దాకా ఇస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపైనే కాక.. బస్తీల నాయకులు, మహిళల చేరికలపైనా రాజకీయ పార్టీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. స్థానికంగా ఉండే నేతల ద్వారా సంప్రదింపులు జరిపి.. ఒకేసారి 100 నుంచి 500 మంది పార్టీలో చేరేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా ఒక నియోజకవర్గంలో వందలాది మంది మహిళలను స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పార్టీలోకి ఇలాగే ఆహ్వానించారు. ఆరా తీస్తే.. ‘‘స్థానిక నాయకురాలు రమ్మంటే ఆ కార్యక్రమానికి వెళ్లాం. ‘కండువా కప్పించుకుని వచ్చేయండి.. తర్వాత మీ ఇష్టం’ అని ఆమె మాకు ముందే చెప్పింది. డబ్బులు ఇచ్చారు.. వెళ్లామంతే’’ అని ఆ మహిళలు చెప్పారు. నగరంలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, ముషీరాబాద్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.