జంట హత్యలకు క్షుద్రపూజలు కారణం కాదట : లాయర్‌‌ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కుటుంబంలో అందరూ విద్యావంతులైనా మూఢనమ్మకాల వలలో వారు చిక్కుకుపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తండ్రి పురుషోత్తమ నాయుడు, తల్లి పద్మజ కలిసి కుమార్తెలు అలేఖ్య, సాయి దివ్యలను అత్యంత క్రూరంగా చంపడం అందరినీ విస్మయపరిచేలా చేసింది. అయితే.. ఈ జంట హత్యల కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. మూఢనమ్మకాల మైకంలో హత్యలు జరిగాయని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా […]

Written By: Srinivas, Updated On : January 31, 2021 11:00 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కుటుంబంలో అందరూ విద్యావంతులైనా మూఢనమ్మకాల వలలో వారు చిక్కుకుపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తండ్రి పురుషోత్తమ నాయుడు, తల్లి పద్మజ కలిసి కుమార్తెలు అలేఖ్య, సాయి దివ్యలను అత్యంత క్రూరంగా చంపడం అందరినీ విస్మయపరిచేలా చేసింది.

అయితే.. ఈ జంట హత్యల కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. మూఢనమ్మకాల మైకంలో హత్యలు జరిగాయని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. పురుషోత్తం నాయుడు, పద్మజ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అసలు ఏం జరిగిందనేది పోలీసులు అంచనాకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ లాయర్‌‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

హత్య జరిగిన తర్వాత కనిపించిన దృశ్యాలు, పురుషోత్తంనాయుడు, పద్మజల ప్రవర్తన చూసిన తర్వాత క్షుద్రపూజలు, మూఢ విశ్వాసాలేనని అందరూ నిర్ధారణకు వచ్చారు. కానీ.. ఇప్పుడు ఈ లాయర్‌‌ చేసిన వ్యాఖ్యలు కేసును మరో మలుపు తిప్పుతున్నాయి. మదనపల్లె సబ్‌జైలులో ఉన్న పురుషోత్తంనాయుడిని కలిసిన రజనీ అనే న్యాయవాది.. హత్యల వెనుక ఏదో మిస్టరీ ఉందని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన లాయర్‌‌ కృష్ణమాచార్య తరఫున వచ్చిన లాయర్‌‌ రజనీ శనివారం మదనపల్లి సబ్‌ జైలులో ఉన్న పురుషోత్తంనాయుడు, పద్మజలను కలిసి మాట్లాడేందుకు యత్నించారు.

అయితే.. జైలు అధికారులు నేరుగా కలిసేందుకు అనుమతివ్వలేదు. దీంతో దూరంగా ఉండే ఆమె పురుషోత్తం నాయుడితో మాట్లాడారు. హత్యలకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. పది నిమిషాల తర్వాత సమయం అయిపోయినట్లుగా అధికారులు చెప్పడంతో వెనుదిరిగారు. అయితే.. పురుషోత్తం నాయుడితో మాట్లాడిన తర్వాత జంట హత్యలకు ప్రధాన కారణం క్షుద్రపూజలు కాదని ఆమె అన్నారు. ఇప్పటివరకు తెలిసిన వివరాలు, పురుషోత్తం నాయుడి ఇంట్లోని దృశ్యాలను పరిశీలించిన తర్వాత దీని వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

హత్యాస్థలంలో కనిపించిన దృశ్యాలు క్షుద్రపూజలవి కావని కొట్టిపారేశారు. అలాగే.. అంతటి ఘోరానికి పాల్పడడానికి కారణం నిందితుల ఆధ్యాత్మిక మైకం కూడా కారణం కాకపోవచ్చని తెలిపారు. కేసులో చెప్తున్న కారణాలకు, నిందితుల ప్రవర్తనకు సంబంధం లేదని అంటున్నారు. ఇక్కడ రుద్రుడు (శివుడు), క్షుద్రుడు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలను కలిపి చూడలేమని, వీటికి సంబంధమే లేదని అన్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూడాలన్నారు. నిందితులకు న్యాయసలహా అవసరమని భావించే ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు.