బాలీవుడ్‌లో ముక్కుసూటితనంతో వ్యవహరిస్తూ వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘వై’ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది. ఆది నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ బోల్డ్ బ్యూటీ సుశాంత్ మరణం తర్వాత తన కామెంట్లతో, ట్వీట్స్‌తో మరింత చర్చకు తెరలేపింది. బాలీవుడ్‌లో నెపోటిజం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై అక్కడి సెలబ్రెటీలు చాలామంది అభ్యంతరం తెలిపారు. బాలీవుడ్ అంతా ఒకవైపు వెళుతుంటే.. కంగనా మాత్రం మరోవైపు వెళుతోందనే వాదనా ఉంది. ఇటీవల ముంబై నగరంపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: నిలకడగా బాలు ఆరోగ్యం.. ఎస్పీ చరణ్ అప్డేట్
ఈ వ్యాఖ్యలపై అధికార శివసేన తీవ్రంగా మండిపడింది. మహారాష్ట్ర, ముంబై, మరాఠాల గురించి మితిమీరి మాట్లాడితే సహించేది లేదని, తాను చేసిన వ్యాఖ్యలపై కంగనా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. కంగనా క్షమాపణ చెప్పకుంటే ముంబైలో అడుగుపెట్టనిచ్చేది లేదని ట్విట్టర్ వేదికగా శివసేన కార్యకర్తలు తెగేసి చెప్పారు. అయితే.. ఈ విమర్శలకూ కంగనా కౌంటర్ ఇచ్చింది. తాను ఈ నెల 9న ముంబైకి వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో కంగనాకు ప్రాణ హాని ఉందని, ఆమె భద్రతపై సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భద్రత కల్పించేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు కేంద్రం కూడా ఆమెకు ‘వై’ ప్లస్ భద్రత కల్పించింది.
అయితే.. కంగనాకు భారీ ఖర్చుతో ఆ స్థాయి సెక్యూరిటీ కల్పించడంపై సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీని ఉపసంహరించుకోవాలని ట్వీట్ చేశారు. ‘ఒక్క మనిషికి నెల రోజులపాటు వై+ కేటగిరీ భద్రత కల్పించాలంటే ప్రభుత్వంపై రూ.10 లక్షల భారం పడుతుంది. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుల నుంచే ఆ ఖర్చు పెడతారు. కంగనా ఇప్పుడు సురక్షితంగా హిమాచల్‌ప్రదేశ్ చేరుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుంటుందా’ అని బ్రిజేష్ ప్రశ్నించారు.
Also Read: అనుష్కపై జర్నలిస్టు వ్యంగ్యాస్త్రం.. మారుతి స్ట్రాంగ్ కౌంటర్
దీనికి స్పందించిన కంగన ‘బ్రిజేష్ జీ.. మీరు, నేను చెప్పేదాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. ఇంటెలిజెన్స్ బ్యూరో సూచనల మేరకే భద్రత విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. నాకు అపాయం లేదని వారనుకుంటే భద్రతను తీసేస్తారు. నాకు ప్రమాదం ఉందని తెలిస్తే నా భద్రతను మరింత పెంచుతారు’ అని తెలిపింది.