Baba Siddhikhi Murder : సిద్ధిఖి హత్య నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించిన వివరాలను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు..” ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖి పై మొత్తం ఆరు రౌండ్ల పాటు కాల్పులు జరిగాయి. అందులో మూడు బుల్లెట్లు బాబా సిద్ధిఖి శరీరం లో నుంచి దూసుకెళ్లాయి. ఆయనను హత్య చేసిన ముగ్గురిలో ఇప్పటికే ఇద్దర్నీ గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. వారిని విచారిస్తున్నాం. మూడో నిందితుడు ఎవరో గుర్తించాం. త్వరలో అతడిని కూడా అరెస్టు చేస్తాం.. ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ -3 లో నిందితుల విచారణ కొనసాగుతోందని” ముంబై క్రైమ్ బ్రాంచ్ డిసిపి విశాల్ ఠాకూర్ వివరించారు.. సిద్ధిఖి తన కుమారుడి కార్యాలయంలో ఉండగానే హత్యకు గురయ్యారు. బాంద్రా లో సిద్ధిఖి కుమారుడికి కార్యాలయం ఉంది. శనివారం సిద్ధిఖి ఆ కార్యాలయంలో ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖి ని కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే కాల్పులకు పడిన వారిలో ఇద్దరినీ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
40 ఏళ్లపాటు కాంగ్రెస్ లో..
సిద్ధిఖి 40 సంవత్సరాలు పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1999, 2004, 2009 బాంద్రా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లో మహారాష్ట్ర కు మంత్రిగా వ్యవహరించారు. సిద్ధిఖి హత్య విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్.. హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 18 సీజన్ కు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ షో షూటింగ్ మధ్యలోనే ముగించి సల్మాన్ సిద్ధిఖిని పరామర్శించడానికి వెళ్లారు.. సల్మాన్ ఖాన్ కు సిద్ధిఖి కి మధ్య మంచి స్నేహం ఉంది.. సిద్ధిఖి ప్రతి ఏడాది రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇస్తారు. ఆ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ కచ్చితంగా హాజరవుతారు. అలాగే సిద్ధిఖి ఇంట్లో ఇలాంటి వేడుక జరిగిన సరే సల్మాన్ ఖాన్ తప్పనిసరిగా వస్తుంటారు. అయితే సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడైన సిద్ధిఖి హత్యకు గురి కావడం.. బాలీవుడ్ కండల వీరుడిని దిగ్బ్రాంతికి గురిచేస్తుంది. కాగా, 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సిద్ధిఖి గత ఫిబ్రవరిలో.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అజిత్ పవర్ ఆధ్వర్యంలోని ఎన్సీపీలో చేరారు. మరో నెల రోజుల్లో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా బాంద్రా వెస్ట్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే లారెన్స్ గ్యాంగ్ కాల్పులు జరిపి సిద్ధిఖి ని హతమార్చింది. దీంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.