Munugode By Poll: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటర్లు చుక్కలు చూపించారు. నేతలు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటు వేసేందుకు నిరాకరించారు. దీంతో అధికార పార్టీ నాయకుల్లో ఒకింత టెన్షన్ నెలకొంది. వారు ఎంతసేపు బతిమిలాడినా కూడా ఓటర్లు ఓటు వేసేందుకు ఒప్పుకోలేదు. ఎలాగైనా వారితో ఓట్లు వేయించుకోవాలని ఉద్దేశంతో చివరి నిమిషంలో నాయకులు భారీగా తాయిలాలు ఇచ్చారు. ముఖ్యంగా చండూరు మండలంలోని చాలా వరకు గిరిజన తండాల్లో ప్రజలు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ తండాలకు వెళ్లే దారులన్నీ అధ్వానంగా మారాయి. బాగు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో తండావాసులు నరకం చూస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనేది అనివార్యమయింది. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. మునుగుడిలో ఎలాగైనా గెలవాలి అనే తలంపుతో ఉన్న టిఆర్ఎస్ అప్పటిదాకా పెండింగ్లో ఉన్న నిధులు మొత్తం విడుదల చేసింది. అయితే గ్రామాలకు మాత్రం నిధులు విడుదల కాలేదు. రోడ్లకు మరమ్మత్తులు నిర్వహించే నాధుడు కానరాకపోవడంతో అక్కడి తండావాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

చాలావరకు రాజకీయ పార్టీలు ఈ గ్రామాల్లో ప్రచారాన్ని మినహాయించాయి. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన తండావాసులు అదును చూసి వాత పెట్టాలి అనుకున్నారు. ఆరోజు రానే వచ్చింది. నిన్న రాజకీయ పార్టీల నాయకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తండావాసులు.. గురువారం మాత్రం ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీనిపై ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికార పార్టీ అలర్ట్ అయింది. తమ పార్టీ నాయకులను రంగంలోకి దింపినా పెద్దగా ప్రయోజనం తగ్గలేదు. దీంతో చాలాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తర్వాత మంత్రి కేటీఆర్ స్వయంగా తండావాసులకు ఫోన్ చేయడంతో వారంతా ఓటు వేసేందుకు వచ్చారు. నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి కనిపిస్తున్నారు. రాత్రి పదింటి దాకా పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.