CM Jagan- MLAs: ఏపీ సీఎం జగన్ లో ఇటీవల అసహనం ఎక్కువవుతోంది. పదవులిచ్చిన మంత్రులపైనా రుసరుసలాడుతున్నారు. అటు ఎమ్మెల్యేల పనితీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు 175 నియోజకవర్గాల్లో గెలుపు అసాధ్యం కాదంటూనే.. కొందరి పనితీరు బాగాలేదని.. మార్చేస్తానని హెచ్చరికలు జారీచేస్తున్నారు. చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను సైతం గెలిచేస్తామని దీమా వ్యక్తం చేస్తూనే..మరోవైపు కొందరి గురించి పార్టీని వదులుకోలేనని..ప్రత్యామ్నాయ నాయకత్వం చూసుకుంటానని కూడా చెబుతున్నారు. అయితే మొత్తానికైతే సీఎం జగన్ కు ఏదో కలవరపాటులో మాత్రం ఉన్నట్టు కనిపిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా వర్కుషాప్ లు నిర్వహిస్తున్నారు. గడువుల మీద గడువులిచ్చి.. మీరు పనిచేయాల్సిందేనని తేల్చిచెబుతున్నారు.

రాష్ట్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల రివ్యూకు ఇటీవల సీఎం జగన్ సిద్ధమయ్యారు. నియోజకవర్గానికి 50 మంది క్రియాశీలక నేతలకు సమావేశాలకు పిలిపించారు. అయితే రెండు నియోజకవర్గాలతో మమ అనిపించే శారు. ఆ చివరన ఉన్న రాజాం, ఈ చివరన ఉన్న కుప్పం నియోజకవర్గ రివ్యూపెట్టి నేతల అభిప్రాయాలను సేకరించారు. అయితే ఎటువంటి ప్రశ్నలు వేయొద్దని నేతలు ట్రయినింగ్ ఇచ్చి పంపినా.. నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు మాత్రం కుండబద్దలుగొట్టినట్టు మాట్లాడారు. పార్టీ పరిస్థితి ఏమంతా బాగాలేదని చెప్పుకొచ్చారు. ద్వితీయ శ్రేణి క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి ఉందంటూ చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలు పంచడంతో సరిపోదని.. అభివృద్ధి కూడా చేయాల్సి ఉందని నొక్కి ఒక్కానించిచెప్పడంతో సీఎం జగన్ కు తత్వం బోధపడింది. అటు సమావేశానికి హాజరైన నాయకులు నిధులు విడుదల చేయాలని కోరడం కూడా జగన్ కు ఇష్టపడలేదు. అందుకే తరువాత నియోజకవర్గాల రివ్యూలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
అయితే తాజాగా సీఎం జగన్ బుధవారం అధికారులు, ఎమ్మెల్యేలతో వర్క్ షాపు నిర్వహించనున్నారు. అటు తరువాత ఎమ్మెల్యేలతో విడిగా సమావేశం కానున్నారు. ఇది వరకే రెండు సార్లు సమావేశమై ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కొంత గడువు ఇచ్చి మారకపోతే మార్చేస్తానంటూ సంకేతాలిచ్చారు.

జగన్ ఇచ్చిన గడువు ముగిసింది. అటు పీకే టీమ్ లోని రుషిరాజ్ బృందంతో, ప్రభుత్వ నిఘా వర్గాలతో జగన్ మూడు సర్వేలు చేయించారు. వాటి జాబితాను పట్టుకొని జగన్ వర్కుషాప్ నిర్వహించనున్నారు. గడపగడపకు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో వెనుకబడిన ఎమ్మెల్యేల పేర్లు నేరుగా చదవనున్నారు. అయితే ఇదే సమావేశంలో ఎక్కడ వెనుకబాటు ఉందో అక్కడ నియోజకవర్గ సమన్వయ కర్తలను నియమించనున్నట్టు తెలిసింది. మరోవైపు 175 నియోజకవర్గాలకు పరిశీలకులను కూడా నియమించనున్నట్టు సమాచారం. మొత్తానికైతే ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.ఈ 17 నెలల పాటు వారికి పరీక్షా కాలమే.