Chandrababu: చంద్రబాబు 40 ఈయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెబుతుంటారు. 72 ఏళ్ల నవయువకుడిగా తనను తాను పరిచయం చేసుకుంటారు. తన ఆలోచనలు యంగ్ స్టార్ గా ఉంటాయంటారు. అయితే అటువంటి వ్యక్తి తనకిదే లాస్ట్ చాన్స్ అంటూ ప్రజల వద్ద దేహీ అని దేబిరించడం మాత్రం ఆశ్యర్యపరుస్తోంది. జగన్ సర్కారును గద్దె దించేందుకు ఆయనకు వేరే మార్గం లేకపోవడంతో ప్రజల్లో సానుభూతిని రగల్చడానికి ఇటువంటి స్లోగన్ తెరపైకి తెచ్చి ఉంటారని అనుకోవచ్చు. ఒక పొలిటీషియన్ గా తన పార్టీని అధికారంలోకి తేవడానికి చేస్తున్న ప్రతయ్నాలను తప్పుపట్టలేం.. కానీ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి..ఉమ్మడి ఏపీని ఎక్కువ కాలం పాలించిన ఖ్యాతిని దక్కించుకున్న ఆయన మరోసారి అధికారం కోసం పాకులాడడం ఏమిటని విపక్షాలు, గిట్టనివారు ప్రశ్నిస్తున్నారు. జగన్ మీడియాగా పిలిచే నీలిమీడియా అయితే అదే పనిగా కథనాలు వండి వారుస్తోంది. చంద్రబాబుకు మరింత అపప్రదను మూటకడుతోంది.

అయితే చంద్రబాబు ఈ రాష్ట్రం కోసం లాస్ట్ చాన్స్ అన్న ప్రయోగం తెరపైకి తెచ్చారా.. లేక పార్టీ కోసమా.. లేక తన కుమారుడికి మంచి పొలిటికల్ లైఫ్ కోసమా అన్నది తేలాల్సి ఉంది, తొమ్మిది సంవత్సరాల పాటు ఉమ్మడి ఏపీకి, మరో ఐదేళ్లు అవశేష ఆంధ్రప్రదేశ్ కు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. సుమారు 25 సంవత్సరాలు విపక్ష నేతగా, టీడీపీ అధినేతగా ఉన్నారు. నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అటువంటి నేపథ్యమున్న ఒక నేత లాస్ట్ చాన్స్ అంటూ ప్రజలను వేడుకోవడంపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. అనుకూలమైన వారు అది నిజమే కదా.. ఆయన అభ్యర్థించడంలో తప్పు లేదు కదా అని చెబుతున్నారు. వ్యతిరేకులు మాత్రం ఇంకా పదవిపై ఆశ తగ్గలేదు. వారసుడి కోసమే తపన అని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే చంద్రబాబు లాస్ట్ చాన్స్ అన్న మాటతో తన గోతిని తానే తవ్వుకున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. చంద్రబాబు వయసురీత్యా 72 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారు. ఎటువంటి అనారోగ్యం దరి చేరలేదు. మరో పది సంవత్సరాల పాటు యాక్టివ్ రాజకీయాలు చేసేటంత స్థితిలో మాత్రం ఉన్నారు. అటు వృద్ధాప్యంలో కూడా భారత రాజకీయాలను శాసించిన ఎంతో మంది నాయకులు ఉన్నారు. చంద్రబాబుకు పాలనా దక్షుడిగా మంచి పేరుంది అటువంటి వ్యక్తి లాస్ట్ చాన్స్ అన్న మాట ద్వారా గెలిస్తే పాలిస్తాను.. లేకుంటే ఇంటికి పోతాను అన్న సంకేతాలిచ్చారు. అంటే గెలిస్తే 2024 నుంచి 2029 వరకూ పాలిస్తాను. లేకుంటే 2024లోనే రాజకీయాల నుంచి వైదొలుగుతానని హెచ్చరికలు పంపినట్టయ్యింది. అందునా చంద్రబాబును వ్యతిరేకించే మెజార్టీ వర్గాలు తమ విశ్లేషణలు మొదలు పెట్టేశాయి. మధ్యలోనే ఆయన సీఎం పదవి విడిచిపెడతారని.. కుమారుడ్ని సీఎం పీఠంపై కూర్చొబెట్టి రాజకీయ సన్యాసం తీసుకుంటారని ప్రచారం ప్రారంభించాయి.

చంద్రబాబు లాంటి డైనమిక్ లీడర్ సానుభూతి అనే మాటను నమ్ముకోవడం ఏమిటన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. తన పాలనలో విజయాలు, వైఫల్యాలను భేరీజు వేసుకుంటూ..గాడితప్పిన పాలనను సన్మార్గంలో పెడతానని..తనకు ఒక చాన్సివ్వాలని కోరితే బాగుండేదని.. కానీ లాస్ట్ అనే మాట ప్రయోగించడం మాత్రం స్వయంకృతాపమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు ఆలోచనలు చాలా ఫాస్ట్ గా ఉండేవి. ప్రత్యర్థులకు అంతుచిక్కేవి కావు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు అయోమయ స్థితిలో కొన్ని పొరపాట్లకు అవకాశమిస్తున్నారు. అందులో భాగంగా లాస్ట్ చాన్స్ అన్న మాటతో ప్రత్యర్థులకు కార్నర్ అయ్యారు. అయితే చంద్రబాబు కోరిక సహేతుకమేనన్న వాదన ఉంది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సీనియార్టీ అవసరం. ఇప్పుడు చంద్రబాబు కోరికను మన్నిస్తే ఆయన ప్రకటన కరెక్ట్ అని తేలుతుంది. లేకుంటే మాత్రం రాష్ట్రం నష్టపోతుంది తప్ప.. ఆయనకు పోయేదేమీ లేదని అనుకూలురు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు లాస్ట్ చాన్స్ అన్న మాట తన ఔన్నత్యాన్ని తగ్గించుకున్నట్టుందని విశ్లేషకులు చెబుతున్నారు.